పర్యాటకులకు శుభవార్త.. ప్రయాణ ఖర్చంతా కేంద్రానిదే..  - MicTv.in - Telugu News
mictv telugu

పర్యాటకులకు శుభవార్త.. ప్రయాణ ఖర్చంతా కేంద్రానిదే.. 

January 27, 2020

Prahlad Singh Patel

నిరంతరం కొత్త ప్రదేశాలను సందర్శించే పర్యాటక ప్రేమికులకు శనివారం కేంద్రం ఓ బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. తమ సొంత రాష్ట్రంలో కాకుండా దేశీయంగా ఉన్న 15 పర్యాటక ప్రదేశాలను చుట్టి వచ్చేవారికి ప్రయాణ ఖర్చులన్నీ తామే భరిస్తామని కేంద్రం వెల్లడించింది. కోణార్క్‌లో జరిగిన రెండు రోజుల జాతీయ పర్యాటక సదస్సు ముగింపు కార్యక్రమంలో టూరిజం మినిస్టర్ ప్రహ్లాద్ సింగ్ పటేల్ ఈ మేరకు ప్రకటించారు. 

ప్రయాణికులకు వారి ప్రయాణ ఖర్చులను ప్రోత్సాహకంగా స్పాన్సర్ చేయడం ద్వారా బహుమతి ఇవ్వాలని నిర్ణయించినట్లు ఆయన చెప్పారు. ‘కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పర్యటన్ పర్వ్ కార్యక్రమంలో భాగంగా 2022 నాటికి అతడు/ ఆమె భారత దేశంలోని 15 పర్యాటక ప్రదేశాలను(సొంత రాష్ట్రాన్ని మినహాయించి) చుట్టి రావలసి ఉంటుంది. ఈ టాస్క్‌ను ఒక సంవత్సరం లోపు పూర్తి చేసినవారికి మాత్రమే కేంద్రం రివార్డ్‌తో సత్కరిస్తుంది. ఆయా ప్రదేశాల్లో పర్యటించినవాళ్లు తమ ఫోటోలను పర్యాటక శాఖ వెబ్‌సైట్‌లో పొందుపరచాల్సి ఉంటుంది. ఈ కార్యక్రమంలో ఎంపికైనవారిని భారతీయ పర్యాటక బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రకటిస్తాం. దేశవ్యాప్తంగా టూరిస్టులను ప్రోత్సహించడంలో భాగంగా ఈ కార్యక్రమం తలపెట్టాం. ఈ కార్యక్రమానికి సంబంధించిన సమాచారాన్ని అధికారిక వెబ్‌సైట్ ద్వారా తెలియజేస్తాం’ అని ప్రహ్లాద్ సింగ్ పటేల్ తెలిపారు. 

మరోవైపు టూరిస్ట్ గైడ్స్‌గా పని చేయాలనుకునేవారికి కూడా పర్యాటక మంత్రిత్వ శాఖ తరఫున సర్టిఫికెట్ ప్రోగ్రాంను నిర్వహించనుంది.