ఆడపిల్లల వివాహ వయసు పెంపు!  - MicTv.in - Telugu News
mictv telugu

ఆడపిల్లల వివాహ వయసు పెంపు! 

October 16, 2020

Govt to soon decide on minimum age of marriage for girls PM Modi.j

పెళ్లికి అమ్మాయి వయసు 18, అబ్బాయి వయసు 21 ఉన్న విషయం తెలిసిందే. అయితే ఆడపిల్లల వివాహ వయసును సవరించడం దిశగా కేంద్రం సమాలోచనలు చేస్తోంది. ప్రసూతి మరణాల రేటు, పోషకాహార స్థాయుల మెరుగుదల వంటి పలు అంశాలను పరిగణలోకి తీసుకుని కేంద్రం త్వరలో ఓ నిర్ణయం తీసుకోనున్నట్టు ప్రధాని మోదీ వెల్లడించారు. తన ప్రభుత్వం గత ఆరు సంవత్సరాల్లో అమలు చేసిన చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయని మోదీ అభిప్రాయపడ్డారు. మన దేశంలో పాఠశాలల్లో నమోదైన బాలుర కన్నా బాలికల సంఖ్య ఎక్కువ ఉందని.. ఇలా జరగడం ఇదే మొట్టమొదటిసారి అని తెలిపారు. ఎఫ్ఏఓ (ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్) 75వ వార్షికోత్సవాల సందర్భంగా మోదీ వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రసంగించారు. ఈ సందర్భంగా రూ.75 విలువగల నాణేన్ని విడుదల చేశారు.  

ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. ‘ఆడ పిల్లలకు వివాహం చేయడానికి యుక్తమైన వయసు గురించి ముఖ్యమైన సమాలోచనలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించిన కమిటీ నివేదిక గురించి దేశవ్యాప్తంగా అనేక మంది మహిళలు నన్ను ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంలో ఓ నిర్ణయం ఎప్పుడు తీసుకుంటారని అడుగుతున్నారు. కమిటీ నివేదిక వచ్చిన తర్వాత దీనిపై తగిన నిర్ణయం తీసుకుంటాం’ అని మోదీ తెలిపారు. కాగా, ఫిబ్రవరి 1, 2020న ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో ఈ ప్రస్తావన తీసుకువచ్చారు. ఆడపిల్లలు మాతృత్వంలోకి ప్రవేశించడానికి తగిన వయసు గురించి పరిశీలిస్తామని పేర్కొన్నారు. అనంతరం జూన్‌లో జయా జైట్లీ నేతృత్వంలో ఓ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటుచేయగా, ఈ ప్యానెల్‌లో 10 మంది సభ్యులు ఉన్నారు. ఈ కమిటీ నివేదికను జూలై 31నాటికి సమర్పించవలసి ఉంది. అయితే ఈ గడువు దాటిపోవడంతో చాలా మంది ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు