ఏపీలో ఇసుక వాహనాలకు జీపీఎస్ తప్పనిసరి అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. డిసెంబర్ 10వ తేదీ నాటికి ఇసుక రవాణా చేసే ప్రతీ వాహనానికి జీపీఎస్ తప్పనిసరిగా ఉండాలని అధికారులకు సూచించారు. ఇసుక ధర, లభ్యతపై ప్రతివారం జిల్లాస్థాయిలో పత్రికల ద్వారా సమాచారం ఇవ్వాలి అని తెలిపారు. ఈ రోజు జగన్ రైతు భరోసా, వైఎస్ఆర్ నవశకం లబ్ధిదారుల ఎంపికపై అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా జగన్ పలు నిర్ణయాలు తీసుకున్నారు. రైతు భరోసా కింద 45.82 లక్షల మందికి చెల్లింపులు పూర్తి చేశామని వెల్లడించారు. మరో 2.14 లక్షల మంది రైతులకు వారంలోగా చెల్లించాలని అధికారులను ఆదేశించారు. వర్క్ షాపుల ఏర్పాటుపై కలెక్టర్లు దృష్టి సారించాలని పేర్కొన్నారు
జగన్ మాట్లాడుతూ.. ‘ఆరోగ్యశ్రీకి ఏడాదికి రూ.268.13 కోట్లు ఖర్చవుతంది అని మా అంచనా. ఆస్పత్రి నుంచి డిశ్చార్జీ అయిన 48 గంటల్లో రోగుల ఖాతాల్లో నగదు జమచేయాలి. 836 రకాల శస్త్ర చికిత్సలకు ఆరోగ్యశ్రీ వర్తిస్తుంది. రైతులకు ధాన్యం సొమ్ము చెల్లింపులో ఆటంకాలు రాకూడదు. మగ్గం ఉన్న ప్రతి చేనేత కుటుంబానికి వైఎస్ఆర్ నేతన్న నేస్తం వర్తింపు చేస్తాం. డిసెంబర్ 21న చేనేత కుటుంబాలకు రూ.24 వేల ఆర్థిక సాయం అందించనున్నాం. జనవరి 1నుంచి పొరుగు సేవల సిబ్బందికి కార్పొరేషన్ ద్వారా వేతనాలు ఇస్తాం. డిసెంబర్ 15నాటికి పొరుగుసేవల సిబ్బంది జాబితా సిద్ధం చేయాలి’ అని జగన్ తెలిపారు.