గ్రాండ్ ఫినాలే ముగింపు.. విజయ్ చేతుల మీదుగా బహుమతులు - MicTv.in - Telugu News
mictv telugu

గ్రాండ్ ఫినాలే ముగింపు.. విజయ్ చేతుల మీదుగా బహుమతులు

February 24, 2020

మైక్ టీవీ, 10టీవీ సంయుక్తంగా నిర్వహిస్తున్న పల్లె పాటల పోటీ కార్యక్రమం ‘ఫోక్ స్టూడియో’కు ఈవారంతో ముగింపు పలుకుతున్నాం. వారం వారం మిమ్మల్ని ఎంతగానో అలరించిన ఈ కార్యక్రమం ముగిసింది. మిమ్మల్ని ఆకట్టుకుందని మీరు కామెంట్ల ద్వారా చెప్పారు. ఆదరించిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ప్రిలిమ్స్, క్వార్టర్ ఫైనల్స్, సెమీ ఫైనల్స్, గ్రాండ్ ఫినాలే.. ఇలా మా పాటల ప్రయాణం మీ ఆదరణతో సుదీర్ఘంగా కొనసాగింది. ఈ వారంతో విజేత ఎవరో తేలిపోయింది. సెమీ ఫైనల్స్‌లో ఎనిమిది మంది పాడగా వారిలోంచి నలుగురిని గ్రాండ్ ఫినాలేకు న్యాయ నిర్ణేతలు ఎంపిక చేశారు. ఈ నలుగురిలో ఫోక్ స్టూడియో ట్రోఫీని అందుకునేది ఎవరు? ఆ తర్వాతి స్థానాల్లో నిలిచేది ఎవరు? అనే ఉత్కంఠకు తెరపడింది. 

ప్రతీ ఒక్కరు ఎంతో నిబద్ధతతో పాటలు పాడారు. ఒక్కొక్కరి గొంతు ఒక్కో తీరు. గ్రాండ్ ఫినాలేకు వచ్చినవారే పాటగాళ్లు కాదు. రానివారు తక్కువ కానే కాదు. ఈ పోటీలో మొదటినుంచి పాల్గొన్నవారంతా గొప్ప పాటగాళ్లే. చిన్న చిన్న పొరపాట్లతోనే వారు వెనకడుగు వేశారు అంతే. సెమీ ఫైనల్స్‌లో పాడిన ఆ ఎనిమిది మందిలో నలుగురు గ్రాండ్ ఫినాలేలో పాడారు. రఘు, బైరగోని చంద్రం, చిరంజీవి, సుంకపాక ధరణిలు పాడారు. గ్రాండ్ ఫినాలే అంటే చాలా ప్రత్యేకం కదా. అందుకే ఈ గ్రాండ్ ఫినాలేకు ప్రముఖ యువహీరో అర్జున్ రెడ్డి విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా విచ్చేశారు. అలాగే మరికొందరు విశిష్ఠ అతిథులుగా ప్రజా గాయకుడు గోరటి వెంకన్న, మైహోమ్ జూపల్లి రామేశ్వరరావు, జూపల్లి మేఘన, శ్రీసాయి దీక్షిత డెవ్‌లపర్స్ మార్ల భీంరాజ్‌, టీసాట్ సీఈఓ శైలేష్ రెడ్డి, మైక్ టీవీ అధినేత అన్నపురెడ్డి అప్పిరెడ్డిలు విచ్చేశారు. ‘అందాలను తనువెల్ల ఒంపుకున్న అడవి..

అలరించి తలపించె ఆకుపచ్చని అడవి’ ‘పైకి కనిపిచ్చేయన్ని భ్రమలు 

లోపలున్న సంగీతం అంతా గత జన్మ’ అంటూ రెండు పాటలు పాడి గోరటి వెంకన్న గ్రాండ్ ఫినాలేకు మరింత ఊపును అద్దారు. అలాగే మన బంగారుతల్లి కనకవ్వ, కడప ముద్దుబిడ్డ స్వాతి స్పెషల్ పెర్‌ఫార్మన్స్ కింద చక్కని పాటలు ఆలపించారు.

 

విజేతలు ఇలా.. 

 

-బైరగోని చంద్రం – సిరిసిల్ల (ఫోక్ స్టూడియో మొదటి విజేత, రూ.50,000 బహుమతి)

-సుంకపాక ధరణి – నిజామాబాద్ (ఫోక్ స్టూడియో రెండవ విజేత, రూ.25,000 బహుమతి)

-చిరంజీవి – వరంగల్ (ఫోక్ స్టూడియో మూడవ విజేత రూ.10,000 బహుమతి)

 

విజేతలు అందరికీ ఫోక్ స్టూడియో తరఫున శుభాకాంక్షలు. 10టీవీ, మైక్ టీవీ మీ మరిన్ని విజయాలను ఆశిస్తూ ఆల్ ది బెస్ట్ చెబుతున్నాయి. అలాగే ఈ పోటీలో పాల్గొన్నవారందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. 

 

Grand Finale finale .. Gifts by Vijay’s hands