గడ్డి అన్నారం కూల్చివేతను ఆపండి: హైకోర్ట్ - MicTv.in - Telugu News
mictv telugu

గడ్డి అన్నారం కూల్చివేతను ఆపండి: హైకోర్ట్

March 8, 2022

22

తెలంగాణ హైకోర్ట్ మంగళవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. గడ్డి అన్నారం ఫ్రూట్ మార్కెట్ కూల్చివేతను వెంటనే ఆపాలని ఉత్తర్వులు జారీ చేసింది. మార్కెట్ విషయంలో వ్యాపారులు మరోసారి హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా గడ్డి అన్నారం పడ్ల మార్కెట్లో కూల్చివేతలు వెంటనే ఆపాలని తెలిపింది. కూల్చివేతల తీరు దురదృష్టకరమని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్రశర్మ ధర్మాసనం వ్యాఖ్యానించింది.

అంతేకాకుండా వ్యాపారులు తమ వస్తువులను బాట సింగారం తరలించేందుకు వీలుగా నెల రోజుల పాటు గడ్డి అన్నారం మార్కెట్ తెరవాలని గత నెల 8న హైకోర్టు ఆదేశించింది. అయితే హైకోర్ట్ ఆదేశాలను అమలు చేయడం లేదని ఇటీవల ఉన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో ఈనెల 4న హడావుడిగా మార్కెట్ తెరిచారు. గత నెల 8న ఆదేశించినప్పటికీ ఈనెల 4 వరకు మార్కెట్లోకి అనుమతించకుండా కోర్టు ధిక్కరణకు పాల్పడటంతో పాటు షెడ్లు, భవనాలు కూల్చివేస్తున్నారని ఆరోజు వ్యాపారుల తరఫు న్యాయవాది గంగయ్య నాయుడు హైకోర్టుకు తెలిపారు.

వందలాది పోలీసులను మోహరించి అర్ధరాత్రి నుంచి మార్కెట్ కూలుస్తున్నారని వివరించారు. గడ్డి అన్నారం మార్కెట్‌లోని 106 మంది కమీషన్ ఏజెంట్లలో 76 మంది ఖాళీ చేశారని ప్రభుత్వం తరపు న్యాయవాది తెలిపారు. కోర్టు ధిక్కరణ పిటిషన్ పై విచారణ ఈ నెల 14కి వాయిదా వేసిన హైకోర్టు.. మార్కెటింగ్ శాఖ ముఖ్య కార్యదర్శి రఘునందన్ రావు, డైరెక్టర్ లక్ష్మీబాయి హాజరుకావాలని ఆదేశించింది.

మరోపక్క రెండ్రోజుల గడువు పూర్తి కావడంతోనే కూల్చివేతలు చేపట్టామని అధికారులు తెలిపారు. సువిశాల స్థలంలో త్వరలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. నగరశివారులోని బాట సింగారం లాజిస్టిక్ పార్కులోనే తాత్కాలికంగా పండ్ల మార్కెట్ కార్యకలాపాలు కొనసాగించాలని నిర్ణయించింది. కొహెడలో శాశ్వత మార్కెట్ పూర్తయ్యే వరకు బాట సింగారంలోనే అమ్మకాలు జరుగుతాయని మార్కెటింగ్ శాఖ వర్గాలు చెప్పాయి. హడావుడి కూల్చివేతలపై వ్యాపారులు హైకోర్టును ఆశ్రయించారు.