భూమ్మీద జీవిస్తున్న అతిపెద్ద జంతువు తిమింగలం. ఏనుగు, ఖడ్గమృగం, జిరాఫీ మరేవైనా దాని తర్వాతే. తిమింగలాల్లోనూ నానా రకాలు. జాతిని బట్టి 30 అడుగుల నుంచి 100 అడుగుల పొడవు, వంద నుంచి 400 టన్నులకుపైగా(33 ఏనుగుల బరువు) బరువుండే బ్లూవేల్, గ్రే వేల్ వంటివి మరీ స్పెషల్. మనుషులు శతాబ్దాల నుంచి ఎన్ని తిమింగలాలను చంపుతున్నా మహాసముద్రాల్లో ఇంకా కొన్ని బతికే ఉన్నాయి. అలాంటి ఓ తిమింగలం తల్లి అయి వార్తల్లోకి ఎక్కింది. తిమింగలాలు పిల్లల్ని కనడం మామూలేగా అని తీసిపారెయ్యకండి. ఈ తిమింగలం ఓ టూరిస్టు బోటు పక్కనే ప్రసవించింది. చాలాసేపు అక్కడక్కడే తచ్చాడింది. ఈ అరుదైన సంఘటన వీడియో మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.
అమెరికాలోని లాస్ ఏంజెలిస్‌లో డానా పాయింట్ తీరంలో ఈ అద్భుతం చోటుచేసుకుంది. ఓ గ్రే తిమింగలం ప్రసవవేదనతో తచ్చాడుతుండగా పడవ అక్కడికి వెళ్లింది. ప్రసవం తర్వాత తల్లీ పిల్లా అక్కడక్కడే చక్కర్లు కొట్టాయి. పడవలోని టూరిస్టులు ఈ దృశ్యాలు కళ్లార్పకుండా చూశారు. కొందరు డ్రోన్ నుంచి కూడా వీడియోలు తీశారు. ’మొదట ఆ తిమింగలం నుంచి రక్తం రావడంతో గాయపడిందేమో అనుకున్నాం. తర్వాత బిడ్డ బయటికి వచ్చేసింది. ఇలాంటి వాటిని జీవితంలో ఒకేసారి చూడలగం’ అని అన్నారు. ఈ తిమింగలం పొడవు 35 అడుగులని అంచనా. గ్రే జాతి తిమింగలాలు చలికాలంలో కాస్త వెచ్చదనం కోసం అలస్కా నుంచి మెక్సికోకు వెళ్తుంటాయని, తల్లీ బిడ్డలు కూడా అలా వెళ్లిపోయి ఉండొచ్చని చెప్పారు.