Great Actor kamal haasan birthday special article
mictv telugu

కమల్ హాసన్‌@68 : ఇండియాలో పుట్టిన ఆస్కార్ రేంజ్ నటుడు

November 7, 2022

కమల్ హాసన్.. సినీ కళామతల్లికి దొరికిన ఓ ‘స్వాతి ముత్యం’. దక్షిణాది ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని ‘భారతీయుడు’. ప్రయోగాలు, విభిన్నపాత్రలకు ఆయన ఓ నాయకుడు. తన నటనతో ప్రేక్షకులకు ‘దశావతారం’ చూపిస్తున్న లోకనాయకుడుగా పేరు గడించాడు. వెండితెరపై ‘విశ్వరూపం’ చూపిస్తున్న.. ఆస్కార్ స్థాయి నటుడు. నటుడిగానే కాకుండా…దర్శకుడిగా, నిర్మాతగా ,స్క్రీన్ ప్లే రైటర్ గా, కథకుడిగా వెండితెరపై చెరగని ముద్ర వేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి. ఈ రోజు ఈయన 68 వ పుట్టినరోజు..

1960లో వచ్చిన ‘కళాతుర్ కన్నమ్మ’ అనే తమిళ చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా తన కేరీర్‌ని ప్రారంభించాడు కమల్. ఆ సినిమాలో సావిత్రి, జెమినీ గణేశన్ ప్రధాన తారాగణం. షూటింగ్ సమయంలో కమల్ హాసన్ చెబుతున్న డైలాగులు విని “ ఈ చిన్న పిల్లాడు చాలా బాగా యాక్ట్ చేస్తున్నాడు. రియల్లీ గ్రేట్, పైకొస్తాడు” అన్నారట సావిత్రి గారు. ఆమె చెప్పినట్లుగానే ఆ సినిమాకే బాల నటుడిగా జాతీయ అవార్డ్ కూడా వచ్చింది. ఆ తర్వాత ఆ పిల్లాడే ప్రముఖ దర్శకుడు బాలచందర్ చేతిలో పడి రాటు దేలాడు. బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన అంతులేని కథ సినిమాతో తొలిసారి తెలుగు తెరకు పరిచయమయ్యాడు కమల్ హసన్. ఆ తర్వాత వచ్చిన మరోచరిత్ర, అందమైన అనుభవం, ఆకలిరాజ్యం సినిమాలు.. “వెండితెరకి నువ్వో అలంకారం” అని తెలుగు దిగ్గజ దర్శకులు కమల్‌ను మెచ్చుకునే స్థాయికి తీసుకెళ్లాయి.

బామ్మగా, మరుగుజ్జుగా, బ్రాహ్మాణ స్త్రీ గా, గుడ్డి వాడిగా.. ఒకటని కాదు ఒక తపన తో సైన్స్ ల్యాబ్ లో చేసినన్ని ప్రయోగాలు సినిమాలతో చేశాడు. అమావాస్య చంద్రుడు సినిమాలో మాధవి కి తాత గాను నటించాడు.తన అభిమాన సంఘాలను సమాజ సేవా సంఘాలుగా మార్చిన మొట్టమొదటి నటుడు అతను.18 సార్లు ఫిల్మ్ ఫేర్ అవార్డ్ తెచ్చుకునే ఘనత అతనిది, ఆరుసార్లు అతని సినిమాలు ఆస్కార్ దాకా వెళ్ళాయి. ఇది అతనికి మాత్రమే చెందిన రికార్డ్. ఆకలిరాజ్యం, సాగర సంగమం, స్వాతి ముత్యం, భారతీయుడు ఒకటని కాదు కానీ ఎనభై శాతం సినిమాలు మంచి సినిమాలే.

ఓటిటి సినిమాలు, మారిపోయిన థియేటర్ కల్చర్ హవా నడుస్తున్న టైం లో ,67 ఏళ్లు దాటిన వయసులో కూడా సొంత ప్రొడక్షన్ లో, థియేటర్స్ లో రిలీజ్ చేసి వందల కోట్లు లాభం వచ్చిన సినిమా “విక్రమ్” లో నటించి తానేంటో నేటి యవతరానికి తెలియజేశాడు. సినిమా కోసం ఏవైనా చేసే అతని కష్టం ఏ రంగంలో నైనా విజయం సాధించాలనుకునే వారికి పాఠం. రెస్ట్, రిటైర్మెంట్ తెలీని గొప్ప నటుడు. ఆ విశ్వ నటుడు మరిన్ని మంచి సినిమాలు తియ్యాలని ఆశిద్దాం.