అలలు కలలు ఎగసి సొగసి పోయే….నిజంగానా అప్పుడే అలసి పోయారా. అరే మీ గొంతు ఇంకా అలాగే ఉంది కదండీ. మొన్నటి వరకూ పాడుతూనే ఉన్నారు కదా. సాక్షాత్తు వాణియే మీరు కదా. ఇలా ఎలా జరిగింది. మమ్మల్ని వదిలేసి ఎలా వెళ్ళిపోయారు. ప్రస్తుతం సౌత్ పాటల ప్రేమికుల మనోవేదన ఇది. దు:ఖాన్ని ఆపుకోలేక వస్తున్న మాటలు ఇవి. ముఖ్యంగా తెలుగు సినీ ప్రేక్షకులు. వాళ్ళకు అయితే ఇది నిజంగానే షాక్. నిన్నటికి నిన్న దర్శకుడు విశ్వనాథను కోల్పోయిన తెలుగువారు ఇప్పుడు గాన సరస్వతి వాణీ జయిరామ్ కోల్పోయి దు:ఖ సాగరంలో మునిగిపోయారు.
19 భాషలు, 20 వేల పాటలు….పాటడిన ప్రతీ పాట ఆల్మోస్ట్ హిట్. ఇదొక రికార్డ్ ఈ రికార్డ్ ఏ భాషలోనూ, ఎవరూ సాధించలేనిది….ఒక్క వాణీ జయరామ్ కు మాత్రమే సొంతమైనది. సంగీత వాయిద్యాలు అన్నింటిలో కన్నా వీణ, ఫ్లూట్ ప్రత్యేకమైనవి. పూరాణాల దగ్గర నుంచీ ఉన్నవి. రెండింటిలో నుంచి వచ్చే సంగీతం అత్యంత మధురంగా ఉంటుంది అంటారు సంగీత ప్రియులు. మరి ఆ రెండూ కలగలసినట్టు ఉండే గొంతులోంచి పాట వస్తే….ఆ పాట మధురాతి మధురంగా ఉండదూ. వాణీ జయరాం గొంతు అచ్చు అలాగే ఉంటుంది. గొంతుకు తగ్గ శృతి, దానికి తగ్గ పాట. శాస్త్రీయమా, జానపదమా, వెస్ట్రన్, జాజ్, హుషారైన పాట….ఇలా ఏదైనా కానీ ఆవిడ గొంతులో పడింది అంటే మన చెవులకు అమృతమే. నోట్లో బెల్లం ముక్క పెట్టుకుని పాటలు పాడుతున్నారా అని అనుమానం కలిగించేంత తిమ్మని స్వరం ఒక్క వాణీ జయరాం కే సొంతం.
కురిసేను విరిజల్లులే అంటూ ఘర్షణ సినిమాలో మెలోడీతో మైమరిపించినా.. శ్రీ గణనాధం అంటూ శ్రుతిలయలతో అధ్యాత్మికాన్ని పంచినా ఆమె స్వరరాగ మాధుర్యం మన సినిమాకు దక్కిన అదృష్టం. 19 భాషల్లో పాడిన పాన్ ఇండియా సింగర్. హిందీ, తమిళం, కన్నడం, మలయాళం, తెలుగు, గుజరాతీ, మరాఠీ, మార్వారీ, హర్యాన్వి, బెంగాలీ, ఒడియా, ఇంగ్లిషు, భోజ్‌పురి, రాజస్థానీ, బడగ, ఉర్దూ, సంస్కృతం, పంజాబీ, తుళు. వింటేనే ఆశ్చర్యం వేస్తోంది కదూ. సినిమాల్లో పాటల ప్రయాణం మొదలు పెట్టింది హిందీ సినిమాతో. పుట్టింది, పెరిగింది సౌత్ లోనే అయినా ఆవిడ టాలెంట్ ని మొదట గుర్తించింది మాత్రం హిందీ చిత్రసీమనే చెప్పాలి. గుడ్డి అనే సినిమాతో మొదలయిన ఆమె పాటల ప్రయాణం మొన్న మొన్నటి వరకు సాగింది. కొన్ని రోజుల క్రితం భర్తను పోగొట్టుకున్న వాణీ జయిరాం, అప్పటి నుంచి బయటకు రావడం, పాటలు పాడడం మానేశారు.
పూజ సినిమాలో పూజలు సేయ పూలు తెచ్చాను.. ఆనాటి తరం వారిని మైమరిపించిన పాట. ఇదొక్కటే కాదు ఈ సినిమాలో ఆమె పాడిన పాటలు నాలుగూ ఇప్పటికీ ఆపాత మధురాలుగా వినిపిస్తూనే ఉంటాయి.. నువ్వడిగింది ఏనాడైన కాదన్నానా అంటూ వయసు పిలిచింది సినిమాలో వాణిజయరాం అప్పటి కుర్రకారును ఒక ఊపు ఊపింది. అన్నింటికన్నా వాణీ జయరామ్ ని ఉన్నత స్థాయిలో నిలబెట్టిన సినిమాలు రెండున్నాయి. అవి విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన శంకరాభరణం, స్వాతి కిరణం. శంకరాభరణం సినిమాలో ఏ తీరుగ నను దయచూచెదవో.. పలుకే బంగారమాయెనా.. మానస సంచరరె.. బ్రోచేవారెవరురా అంటూ ఆమె పాడిన 5 పాటలు ఎవర్ గ్రీన్ హిట్.స్వాతి కిరణంలో మొత్తం 11 పాటలూ వాణిజయరాం పాడారు. ఆ పాటలన్నీ ఒకదాన్ని మించి ఒకటి మనల్ని ఎక్కడికో తీసుకువెళ్లిపోతాయి. తెలిమంచు కరిగింది అంటూ పాడినా.. ప్రణతి ప్రణతి ప్రణతి అంటూ ప్రార్ధించినా.. కొండా కోనల్లో లోయల్లో అంటూ హుషారెక్కించినా అది ఒక్క వాణిజయరాంకె చెల్లింది. ఈ రెండింటి గురించి చెప్పుకున్నాక మస్ట్ చెప్పుకోవలసిన సినిమా ఘర్షణ. నిన్ను కోరి వర్ణం అన్నా, ఒక బృందావనం అంటూ ఈత కొట్టించినా, కురిసేను విరిజల్లులే అంటూ మోహ సంద్రంలో ముంచెత్తినా అది వాణీ జయరాంకే చెల్లింది. అసలు అప్పట్లో ఏదైనా కొత్తగా పాడించాలన్నా, కష్టమైన స్వరకల్పన ఉన్నా వాణీ జయరామ్ తో తప్ప ఎవరితోనూ పాడించేవారు కాదట సంగీత దర్శకులు. ఒక గాయనికి ఇంతకన్నా అద్భుతమైన వరం ఏముంటుంది చెప్పండి. అందుకే మనకు అన్ని మంచి పాటలు వచ్చాయి.
తన ఎనిమిదో ఏటనే తొలి కచేరీ ఇచ్చిన వాణిజయరాం 20 వేలకు పైగా సినిమా పాటలు పాడారు. ఇక ప్రైవేట్ ఆల్బమ్స్ అయితే వేలాదిగా ఉన్నాయి. గాయనిగా మూడు జాతీయ అవార్డులు ఆమె అందుకున్నారు. సీతాకొక చిలుక సినిమాలో ఆమె పాడిన అలలు కలలు ఎగసి సొగసి పోయే అన్నట్టుగానే ఆమె పాటలు కూడా ఒక్కసారి తలుచుకుంటే అలలు అలలుగా మన గుండె చప్పుడుతో కలిసి ఎగసి పడుతూనే ఉంటాయి. రీసెంట్ గా వాణీ జయరామ్ కు దేశ అత్యున్నత మూడో పురస్కారం పద్మ భూషణ్ అవార్డును కూడా ప్రకటించారు. కానీ ఆవిడ అది అందుకోకుండానే అందరినీ విడిచి వెళ్ళిపోయారు.
1945 నవంబర్ 30న దురైస్వామి, పద్మావతి దంపతులకు వాణీ జయరామ్ జన్మించారు. తమిళనాడులోని వెల్లూరు ఈమె స్వస్థలం. ఆమె అసలు పేరు కలైవాణి. ఆరుగురు అక్కాచెల్లెళ్లలో వాణీ జయరాం ఐదో సంతానం. ఎనిమిదో సంవత్సరంలోనే సంగీత కచేరీ నిర్వహించి ప్రశంసలు అందుకున్నారు. పదేళ్ల వయస్సులో మొదటిసారి ఆల్ ఇండియా రేడియాలో పాటలు ఆలపించారు. కడలూరు శ్రీనివాస్ అయ్యంగార్ దగ్గర శాస్త్రీయ సంగీతంలో ఓనమాలు దిద్దుకున్న ఆమె తర్వాత టి.ఆర్.బాలసుబ్రమణియన్, త్రివేండ్రం ఆర్.ఎస్.మణి లాంటి వారి విక్షనలో రాటుదేలారు. వాణీ హిందుస్తానీ సంగీతంలో కూడా ప్రావీణ్యం సంపాదించుకున్నారు. పెళ్ళయిన తర్వాతనే భర్త ప్రోత్సాహంతో సినిమాల్లోకి వచ్చారు.
గుడ్డీ చిత్రం ద్వారా నేపథ్య గాయనిగా మారారు. మొదటి పాటకే తాన్‌సేన్‌తోపాటు మరో నాలుగు అవార్డులు అందుకున్నారు. బాలచందర్ దర్శకత్వం వహించిన ‘అపూర్వ రాగంగళ్’ చిత్రానికి తొలిసారి జాతీయ పురస్కారం అందుకున్నారు. కె.విశ్వనాథ్ దర్శకత్వం వహించిన ‘శంకరాభరణం’ చిత్రంలోని మానస సంచరరే గీతానికి రెండోసారి జాతీయ పురస్కారం దక్కింది. ‘స్వాతికిరణం’లోని ‘ఆనతి నియ్యరా హరా పాటకు మూడోసారి ఉత్తమ గాయనిగా జాతీయ అవార్డు సొంతం చేసుకున్నారు వాణీ జయరామ్.
50 ఏళ్ళు పాటలు పాడటం అంటే మామూలు విషయం కాదు. అది కూడా అస్సలు మారని గొంతుతో. 20 ఏళ్ళప్పుడు వాణీ జయరాం గొంతు ఎలా ఉందో 70 ఏళ్ళ వయసులో అలాగే ఉంది. మామూలుగా మనిషి వయసు పెరుగుతున్న కొద్దీ గొంతులు మారుతుంటాయి. అట్ లీస్ట్ గొంతులో వణుకు రావడం, జీర ఉండడం లాంటివి అయినా జరుగుతాయి. కానీ వాణీ జయరామ్ కు అలాంటివేమీ ఉండేవి కాదు. కోయిల పాట బావుంటుందా, వాణీ జయరామ్ దా అని అడిగితే చెప్నడం అత్యంత కష్టం. అలాంటి సుమధురగాయని మన తెలుగులో పాటలు పాడటం తెలుగు సినిమా, ప్రేక్షకుల అదృష్టం. ఈరోజు ఆవిడ లేకపోవచ్చు….కానీ ఆమె పాట మాత్రం మన చెవుల్లో ఎప్పటికీ మారుమోగుతూనే ఉంటుంది.
ఇవి కూడా చదవండి :
వాణీ జయరాం మృతికి వెనక అనుమానం.. రక్తపు మడుగులో..
సన్నీలియోన్ ఫ్యాషన్ షో వద్ద బాంబు పేలుడు