మరీ ఇంత కక్కుర్తా.. సెలబ్రెటీల షాపింగ్స్‌లో నిజం ఎంత? - MicTv.in - Telugu News
mictv telugu

మరీ ఇంత కక్కుర్తా.. సెలబ్రెటీల షాపింగ్స్‌లో నిజం ఎంత?

October 26, 2022

యూట్యూబ్ అంటే ఒకప్పుడు వినోదం. కానీ ఇప్పుడు యూట్యూబ్ అంటే వ్యాపారం. కొంచం క్రేజ్, కాస్త ట్యాలెంట్ ఉంటే చాలు. సొంత ఛానెల్స్ పెట్టుకుని కోట్లు సంపాదించొచ్చు. యూట్యూబ్‌లో దొరకని కంటెంట్ అంటూ ఉండదు. వంటలు, సాఫ్ట్‌వేర్ కోర్సులు, టెక్నలజీ శిక్షణ ఇలా ప్రతి దానిపై వివరణ ఉంటుంది. అందుకే వ్యాపారవేత్తలు తమ బ్రాండ్ ప్రమోషన్స్‌కి యూట్యూబ్‌ని సైతం ఎంచుకుంటున్నారు. అయితే ఇప్పుడు పరిస్థితులు మరింత మారిపోయాయి. లాక్‌డౌన్ తరువాత షూటింగ్స్ లేక ఆదాయం తగ్గిన సెలబ్రెటీలు సైతం యూట్యూబ్ ఛానెల్స్ పెట్టుకుంటున్నారు. ఈ ఛానెల్స్‌లో వారి డైలీ రోటీన్స్, వంటల వీడియోస్, లైఫ్ స్టైల్స్, సినిమా అప్డేట్స్ వంటి విషయాలని పోస్ట్ చేయటమే కాకుండా.. కొత్తగా వారి షాపింగ్స్‌ని కూడా కవర్ చేస్తున్నారు. బట్టలు కొన్నాం, బంగారం కొన్నాం, కార్లు తీసుకున్నాం అంటూ.. షాపింగ్స్‌ని వీడియోల రూపంలో యూట్యూబ్‌లో అప్లోడ్ చేస్తున్నారు. ఆ వీడియోలో స్టార్స్ కొన్న వస్తువులని వారి అభిమానులు సైతం కొనడానికి ముందుకొస్తున్నారు.

అయితే నిజంగానే స్టార్స్ షాపింగ్ చేస్తున్నారా లేక బ్రాండ్ ప్రమోషన్స్ మాత్రమే చేస్తున్నారా అనే కొత్త చర్చ ప్రస్తుతం మొదలైంది. దీనికి కారణం మొన్న బిగ్‌బాస్‌ ఫేం హిమజ పెట్టిన వీడియోనే. రెండు రోజుల క్రితం బిగ్‌బాస్‌ ఫేం హిమజ.. బీఎండబ్ల్యూ కార్‌ కొన్నాను అంటూ వీడియో అప్‌లోడ్‌ చేసింది. కారు ధర, ఫీచర్లు ఇలా అన్ని వివరాలు చెప్పుకొస్తూ.. ఆఖర్లో భారీ షాకిచ్చింది. తాను కారు కొనడం.. దాని ఫీచర్లను ఎక్స్‌ప్లేయిన్‌ చేయడం కల అంటూ వివరణ ఇచ్చింది. ఈ వీడియో చూసాక స్టార్ చేసే షాపింగ్స్ పై డౌట్స్ మొదలయ్యాయి. షాపింగ్‌ చేయకపోయినా.. ఆయా మాల్స్‌, బ్రాండ్స్‌కి సంబంధించిన ఉత్పత్తులను ప్రమోట్‌ చేయవచ్చు అనే విషయం హిమజ పోస్ట్‌ చేసిన బీఎండబ్ల్యూ కారు వీడియో ద్వారా అర్థం అయ్యాకా.. మిగితా సెలబ్రెటీలు సైతం ఇలాగే చేస్తున్నారా అని అనుమానాలు వస్తున్నాయి.
ఈ మధ్య సెలబ్రెటీలు నెలకు మూడు, నాలుగు సార్లు షాపింగ్ చేశామంటూ వీడియోలు పెడుతున్నారు. ఎంత సెలబ్రెటీలు అయినా నెలకు మూడు సార్లు బంగారాలు, ఆభరణాలు, కాస్లీ బ్రాండెడ్ బట్టలు కొనరు కదా అంటున్నారు నెటిజన్స్. చాలా మంది సెలబ్రిటీలు.. బంగారం కొన్నాం, ఆభరణాలు తీసుకున్నాం, ఖరీదైన పట్టు చీరలు కొన్నాం అంటూ అప్‌లోడ్‌ చేసే వీడియోలు ఫేక్ అని.. ఆయా బ్రాండ్స్ ఇచ్చే డబ్బుల కోసం అంత కక్కుర్తి పడటం అవసరమా అంటూ స్టార్స్ ని ట్రోల్ చేస్తున్నారు నెటిజన్స్.