ఏపీలో బస్సులకు గ్రీన్ సిగ్నల్.. బస్టాండ్ టు బస్టాండ్  - Telugu News - Mic tv
mictv telugu

ఏపీలో బస్సులకు గ్రీన్ సిగ్నల్.. బస్టాండ్ టు బస్టాండ్ 

May 18, 2020

Green signal for buses in Andhra Pradesh .. Bus stand to bus stand

లాక్‌డౌన్ 4.0లో భాగంగా అంతర్రాష్ట్ర బస్సులు నడిపేందుకు కేంద్రం తాజాగా మార్గదర్శకాలు విడుదల చేసిన విషయం తెలిసిందే. దీంతో బస్సుల పునరుద్ధరణపై ఏపీ ప్రభుత్వం కసరత్తులు మొదలుపెట్టింది. ఇందులోభాగంగా కరోనాపై సమీక్షలో ఆర్టీసీ బస్సులు నడపడంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చర్చించారు. ముఖ్యంగా ఇతర రాష్ట్రాల్లో ఉన్నవారిని స్వరాష్ట్రానికి తీసుకొచ్చే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. తొలుత హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరు నుంచి ఆర్టీసీ బస్సులు నడపాలని నిర్ణయించినట్లు సమాచారం. దశలవారీగా ఈ సంఖ్య పెంచాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. మధ్యలో ఎక్కడా ఆపకుండా కేవలం ఈ బస్టాండ్‌ నుంచి మొదలుపెడితే మరో బస్టాండ్‌ వరకు మాత్రమే నడపాలని ప్రభుత్వం ఓ నిర్ణయానికి వచ్చింది.

మధ్యలో ఎక్కడా ప్రయాణికులను ఎక్కించుకోవడం, దింపకూడదని నిర్ణయించింది. అలా వచ్చిన వారందరికీ కరోనా పరీక్షలు నిర్వహించి, వారి పూర్తి వివరాలూ సేకరించనున్నారు. మరోవైపు కరోనా ఆంక్షలను పకడ్బందీగా అమలు చేయనున్నారు. బస్సుల్లో ప్రయాణించేవారు తప్పనిసరిగా మాస్కులు ధరించేలా, భౌతిక దూరం పాటించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సగం సీట్లతోనే బస్సులు నడపుతూ, బస్సులో 20 మంది మాత్రమే ప్రయాణించేలా చర్యలకు సిద్ధం అవుతున్నారు. వీటిపై విధివిధానాల రూపకల్పన చేయాలని జగన్‌ అధికారులను ఆదేశించారు. ప్రైవేటు బస్సులు, రాష్ట్రంలో బస్సులు తిప్పే అంశంపై కూడా మూడు నాలుగు రోజుల్లో విధివిధానాలు వెలువడనున్నాయి. అలాగే కార్లలో ముగ్గురు మాత్రమే ప్రయాణించేలా  అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.