అయోధ్యలోని రామజన్మభూమి, బాబ్రీ మసీదు వివాదాన్ని రెండేల్ల క్రితం సుప్రీంకోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే. అయోధ్యలో శ్రీరామ మందిరాన్ని, ధన్నీపూర్ లో మసీదు నిర్మించాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. ఇప్పుడు అయోధ్యలో మసీదు నిర్మాన ప్రాజెక్టుకు చట్టపరమైన అడ్డంకులన్నీ తొలగిపోవడంతో మసీదు నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. రామజన్మభూమి-బాబ్రీ మసీదు వివాదం కేసులో సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో అయోధ్యలో మసీదు నిర్మాణానికి అయోధ్య డెవలప్‌మెంట్ అథారిటీ (ఏడీఏ) తుది ఆమోదం తెలిపింది.
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు యూపీ సర్కార్ మసీదు నిర్మాణానికి 5 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. మసీదు నిర్మాణ ప్రాజెక్టుకు . ఆమోదం పొందిన మ్యాప్‌ను ఐఐసీఎఫ్ ప్రతినిధులకు రెండు రోజుల్లో అందజేస్తామని ఏడీఏ అదనపు కమిషనర్ గౌరవ్ దయాల్ తెలిపారు. కాగా అయోధ్య డెవలప్‌మెంట్ అథారిటీ ఆమోదంలో జాప్యం కారణంగా ఇప్పటి వరకు మసీదు నిర్మాణ పనులు ప్రారంభం కాలేదు. ఇప్పుడు ఇండో-ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్ మసీదుతో పాటు ఆసుపత్రి, పరిశోధనా సంస్థ, కమ్యూనిటీ కిచెన్, లైబ్రరీని నిర్మించాలని నిర్ణయించింది. ఐఐసిఎఫ్ సెక్రటరీ అత్తార్ హుస్సేన్ మాట్లాడుతూ, అన్ని ఆమోద ప్రక్రియలు పూర్తయిన తర్వాత మసీదు నిర్మాణ ప్రాజెక్టును ఖరారు చేసేందుకు ట్రస్ట్ సమావేశాన్ని ఏర్పాటు చేస్తుందని తెలిపారు. అయోధ్యలో మసీదు నిర్మాణానికి 2021 జనవరి 26న శంకుస్థాపన చేశారు.