తెలంగాణలో పనిచేస్తున్న  ఆంధ్రా ఉద్యోగులకు తీపి కబురు. - MicTv.in - Telugu News
mictv telugu

తెలంగాణలో పనిచేస్తున్న  ఆంధ్రా ఉద్యోగులకు తీపి కబురు.

September 14, 2021

స్వరాష్ట్రానికి వెళ్లాలనుకుంటున్న ఆంధ్ర ఉద్యోగుల వెతలు తీరనున్నాయి. తమ ప్రాంతానికి శాశ్వత బదిలీపై పోవాలనుకుంటూ ఎన్నో ఏళ్ళుగా నిరీక్షిస్తున్న ఆంధ్ర ఉద్యోగుల నిరీక్షణకు తెరపడింది. తెలంగాణలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు,అధికారులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. వారు శాశ్వత బదిలీపై ఆంధ్రప్రదేశ్ వెళ్ళేందుకు అనుమతిస్తూ నిన్న ఉత్తర్వులు జారీ చేసింది. ఇక్కడి ఉద్యోగులను బదిలీపై ఏపీ తీసుకెళ్ళేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ఏపీ ప్రభుత్వానికి తెలియజేసినట్టు ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.

అయితే, క్రమశిక్షణ చర్యలు ఎదుర్కొంటున్న వారికి, విజిలెన్స్ కేసులు పెండింగ్ లో ఉన్న వారికి మాత్రం ఈ అవకాశం లేదని తేల్చి చెప్పి వారిని మినహాయించింది.సచివాలయంతో పాటు అన్ని శాఖల కార్యదర్శులు దీనిని అమలుచేయాలని సూచించింది. శాశ్వత బదిలీ కోసం అక్టోబరు15 లోగా దరాఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది.

అలాగే ఉద్యోగి పనిచేసిన శాఖాధిపతి బదిలీకి అభ్యంతరం లేదన్న పత్రం ఇవ్వాల్సి ఉంటుంది. ఏపీ ప్రభుత్వం నుంచి అనుమతి లభించిన వెంటనే  సంబంధిత శాఖాధిపతులు ఉద్యోగులను రిలీవ్ చేయాల్సి ఉంటుంది. రిలీవ్ అయినవారిని శాశ్వతంగా బదిలీ అయినట్టే పరిగణిస్తారు. వారు మళ్ళీ వెనక్కి రావాలంటే మాత్రం కుదరదని ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.బదిలీపై వెళ్ళే వారికి ఎలాంటి ప్రయాణ,కరువు భత్యాలు లభించవని తెలిపింది.

తెలంగాణా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు.