ఉత్తర భారతదేశంలో ఇటీవలే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన విషయం తెలిసిందే. ఈ ఫలితాలలో భాగంగా పంజాబ్ రాష్ట్రంలో ఆమ్ ఆద్మీ పార్టీ 117 స్థానాలకు గానూ 92 సీట్లు సాధించి విజయఢంకా మోగించింది. పంజాబ్ నూతన సీఎంగా భగవంత్ మాన్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ నేపథ్యంలో శనివారం కొత్త మంత్రివర్గ ప్రమాణ స్వీకారం చేసింది. ఇందులో మహిళ మంత్రితో సహా 10 మందిని మంత్రివర్గంలోకి తీసుకున్నారు. అనంతరం పంజాబ్ అసెంబ్లీ సభాపతిగా కల్తార్సింగ్ సంధ్వాన్ను నామినేట్ చేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ నిర్ణయం తీసుకుంది.
అయితే, పంజాబ్ నూతన సీఎంగా పగ్గాలు చేపట్టిన ఆప్ నేత భగవంత్ మాన్ సరికొత్త నిర్ణయాలతో దూసుకెళుతున్నారు. సీఎంగా పదవీ ప్రమాణం చేసిన మూడు రోజులకే తన కేబినెట్‌ను ఏర్పాటు చేసుకున్నారు. తొలి కేబినెట్లోనే నిరుద్యోగుల్లో సరికొత్త ఉత్సాహం నింపేలా కొలువుల జాతరను ప్రకటించారు.
రాష్ట్ర వ్యాప్తంగా 25 వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి మాన్ మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఈ ఉద్యోగాల్లో 10 వేల పోస్టులు పోలీసు శాఖకు చెందినవి కాగా, మిగిలిన 15 వేల పోస్టులు వివిధ ప్రభుత్వ శాఖలకు చెందినవి. మాన్ తన తొలి కేబినెట్ భేటీలోనే 25 వేల ఉద్యోగాల భర్తీకి నిర్ణయం తీసుకోవడం పట్ల పంజాబ్ నిరుద్యోగుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. శభాష్ సీఎం అంటూ పంజాబ్ రాష్ట్ర యువత ఆనందంలో మునిగి తేలుతున్నారు.