పురిట్లో బిడ్డను పోగొట్టుకుని.. 15 లీటర్ల చనుబాలు దానం..  - MicTv.in - Telugu News
mictv telugu

పురిట్లో బిడ్డను పోగొట్టుకుని.. 15 లీటర్ల చనుబాలు దానం.. 

November 28, 2019

Grieving mum spent 63 days pumping breast milk after her premature baby nomore then donated it on her son’s due date 

తొమ్మిది నెలలు కడుపులో మోసింది.. పురిట్లో బిడ్డను చూసి మురిసిపోయింది. కానీ,  పుట్టిన మూడు గంటల తర్వాత ఆ బిడ్డ చనిపోయాడు. బిడ్డ చనిపోవడంతో ఆ తల్లి గుండె తరుక్కుపోయింది. బిడ్డకోసం  పెల్లుబుకుతున్న చనుబాలపై ఆమె సంచలన నిర్ణయం తీసుకుంది. తన చనుబాలను దానం ఇవ్వడానికి ఆమె నిర్ణయించుకుంది. తాను ఎదుర్కొన్న ఆ బాధ మరే తల్లికి రాకూడదని పాలను దానం ఇవ్వడానికి సిద్ధపడింది. యూఎస్‌కు చెందిన సియెర్రా స్ట్రాంగ్‌ఫెల్డ్ అనే మహిళకు పండంటి మగబిడ్డ జన్మించాడు. బిడ్డ పుట్టాడని ఆ తల్లి తెగ మురిసిపోసాగింది. అయితే తానొకటి తలిస్తే విధి ఒకటి తలచిందని.. ‘ట్రిసామీ 18’ అనే అరుదైన జన్యు సంబంధ సమస్యతో పసిబిడ్డ పుట్టాడు. దీంతో పుట్టిన మూడో గంటకే ఆ బిడ్డ చనిపోయాడు. అయితే, ఆమె చనుబాలు అవసరమయ్యే పిల్లలకు ఇచ్చేందుకు అవకాశం ఉందని వైద్యులు చెప్పడంతో ఆమె ఈ కీలక నిర్ణయం తీసుకుంది. 

బిడ్డ చనిపోయిన తర్వాత ఆమె వెస్ట్రన్ గ్రేట్ లేక్స్‌లోని మదర్స్ మిల్క్ బ్యాంక్‌కు తన చనుబాలను దానం ఇవ్వడం మొదలుపెట్టింది. 63 రోజుల్లో 15 లీటర్ల చనుబాలను దానమిచ్చింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘నా బిడ్డ పుట్టిన వెంటనే వెంటిలేషన్ పెట్టి శ్వాస అందించారు. నా భుజాలపై కేవలం ఒకసారి మాత్రమే బిడ్డను పడుకోబెట్టారు. నా స్పర్శ తగలగానే వాడి హార్ట్ రేట్ ఒక్కసారే పెరిగింది. బహుశా.. తాను అమ్మను తాకానని తెలుసుకున్నాడేమో. కానీ, నాతో ఎంతో సేపు ఉండలేదు. మూడు గంటల తర్వాత ఈ అమ్మను విడిచి వెళ్లిపోయాడు. వాడు పోయాక నేను ఒకటే నిర్ణయించుకున్నా. నా బిడ్డ తాగాల్సిన చనుబాలను అవసరం ఉన్న పిల్లలకు దానం చేయాలని నిర్ణయించుకున్నాను. కానీ, అలా పాలు పిండుతున్నప్పుడు కలిగే బాధ భరించలేనిది. తల్లిపాల లోపం వల్ల ఎంతో మంది పసివాళ్లు ప్రాణాలు కోల్పోతున్నారు. నా పాలు కనీసం వారి ప్రాణాలనైనా కాపాడితే చాలు’ అని కన్నీరు మున్నీరు అయిందామె.