మరో గంటలో పెళ్లి.. పీటలపైనే కుప్పకూలిన వరుడు - MicTv.in - Telugu News
mictv telugu

మరో గంటలో పెళ్లి.. పీటలపైనే కుప్పకూలిన వరుడు

May 23, 2022

మరో గంటలో పెళ్లి పీటలపై కూర్చోవాల్సిన వరుడు హఠాత్తుగా మరణించడం కలకలం రేపింది. ఈ ఘటన కర్నూల్ జిల్లా హోళగుంద మండలం గజ్జెహళ్లి గ్రామంలో చోటుచేసుకుంది. జిల్లాలోని పెద్ద కడుబూరు మండలం చిన్న తుంబలం గ్రామానికి చెందిన అబ్దుల్ హమీద్‌కు.. హోళగుంద మండలం గజ్జెహళ్లి గ్రామానికి చెందిన యువతితో మే 22 న పెళ్లి ఖరారైంది. సరిగ్గా పెళ్లి క్రతువు జరిగే సమయంలో వరుడు కుప్పకూలిపోయాడు. కడుపులో నొప్పిగా ఉందని చెప్పడంతో వెంటనే బంధువులు సమీపంలోని సిరిగుప్ప ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే హమీద్‌ మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు. దీంతో పెళ్లి బాజాలు మోగాల్సిన సమయంలో చావు డప్పులు మోగాయి. పెళ్లి ఆగిపోయిందనే బాధలో ఉన్న వధువు తల్లిదండ్రులు, బంధువులు.. అదే ముహూర్తానికి బంధువుల అబ్బాయితో మాట్లాడుకుని పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారు. పెళ్లికొచ్చిన బంధువుల్లో ఒకరైన నబి రసూల్‌తో అదే ముహూర్తానికి పెళ్లి చేయాలని భావించారు. పెళ్లి కూతురు కూడా ఎలాంటి అభ్యంతరం చెప్పకపోవడంతో వెంటనే వారి పెళ్లి జరిగింది. మృతి చెందిన హమీద్ ఇంట్లో తీవ్ర విషాదం అలుముకుంది.