తెలంగాణలో గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. మొత్తం 503 పోస్టులకు నోటిఫికేషన్ వెలువడగా, 2 లక్షల 85 వేల 916 మంది పరీక్షకు హాజరయ్యారు. ఇందులో 1 : 50 నిష్పత్తిలో అభ్యర్ధులను మెయిన్స్ కి ఎంపిక చేశారు. ఒక్కో పోస్టుకు 50 మంది చొప్పున 25 వేల 50 మంది ప్రధాన పరీక్షకు ఎంపికయ్యారు. హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా మహిళలకు 33 శాతం రిజర్వేషన్ ను నేరుగా అమలు చేస్తున్నామని వివరించింది.
అభ్యర్ధులు తమ హాల్ టికెట్ నంబరుతో అధికారిక వెబ్ సైటులో ఫలితాలు తెలుసుకోవచ్చని టీఎస్పీఎస్సీ వెల్లడించింది. ఒకే మార్కులు సాధించిన వారు ఒకే స్థానికతతో ఉన్నప్పుడు పుట్టినతేదీ ఆధారంగా వయసు ఎక్కువ ఉన్నవారికి హయ్యర్ ర్యాంకు ఇచ్చామని తెలిపింది. సికింద్రాబాద్ సెంటర్లో ఇష్టానుసారం బబ్లింగ్ చేసిన వారిని పరిగణనలోకి తీసుకోలేదంది. మెయిన్స్ పరీక్షను జూన్ మొదటి లేదా రెండో వారంలో నిర్వహిస్తామని పేర్కొంది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ ను ఈ నెల 18న ప్రకటిస్తామని తెలిపింది. అంతేకాక, అభ్యర్ధులకు ఏమైనా సందేహాలుంటే హెల్ప్ డెస్క్ ని సైతం కమిషన్ ఏర్పాటు చేసింది. పని దినాల్లో ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, మధ్యాహ్నం 1.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు 040-22445566 లేదా 040-23542187 నెంబర్లకు ఫోన్ చేయాలని సూచించింది. ఇదికాక, [email protected]v.in ఈ మెయిల్ లో సంప్రదించాలని సూచించింది.