తెలంగాణలో పెరుగుతున్న చలితీవ్రత.. 10 డిగ్రీల్లోపే ఉష్ణోగ్రతలు
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత పెరుగుతోంది. గ్రామీణ ప్రాంతాల్లోనే కాకుండా..పట్టణాల్లో రాత్రి పగటి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. తెల్లవారుజామున మంచు కురియడంతో.. ప్రజలు బయటకు వెళ్లాలంటే జంకుతున్నారు. సాయంత్రం 6గంటలు అయ్యిందంటే చాలు చలి తీవ్రత పెరిగిపోతుంది. చలిగాలులు వీస్తున్నాయి. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో పది డిగ్రీల్లోపే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చలిగాలులు ఇదే విధంగా కొనసాగితే వృద్ధులు శ్వాసకోశ సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడే అవకాశం ఉంది.
రాష్ట్రంలో అత్యల్పంగా కుమురం భీం జిల్లా సిర్పూరు(యు)లో 7.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే ఆదిలాబాద్‌లో 9.2, మెదక్‌లో 10, హైదరాబాద్ శివారు నందనవనంలో 11.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ప్రస్తుత సీజన్‌లో ఇంత తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవడం ఇదే మెుదటిసారి. గరిష్ట ఉష్ణోగ్రత ఖమ్మంలో 31.6 డిగ్రీల సెల్సీయస్‌గా రికార్డయ్యింది. రానున్న మూడురోజులు కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు తక్కువ నమోదవుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
మరోవైపు ఏపీలో కూడా చలి పంజా విసురుతోంది. ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు జిల్లా అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రముఖ పర్యాటక ప్రాంతమైన లంబసింగిలో చలితీవ్రత పెరిగింది. చింతపల్లి, పాడేరు తదితర ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.