సొంత స్థలం ఉండి ఇల్లు నిర్మించుకోలేక ఇబ్బందులు పడతున్న వారికి తెలంగాణ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఆర్థిక స్థోమత లేని పేదల కోసం కొత్త ‘గృహలక్ష్మి పథకం’ తీసుకొచ్చినట్లు ఆర్థిక మంత్రి హరీశ్ రావు తెలిపారు. ఈ పథకంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా తొలి విడుతలో 4లక్షల మందికి రూ.3లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించనున్నట్లు చెప్పారు. నిన్న సీఎం కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగిన అనంతరం కేబినెట్ తీసుకున్న నిర్ణయాలను మంత్రి మీడియాకు వివరించారు.
ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. ‘గృహలక్ష్మి పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా 4లక్షల మందికి ఇండ్లు మంజూరు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఒక్కో నియోజకవర్గానికి 3వేల చొప్పున 119 నియోజకవర్గాల్లో ఇండ్లు నిర్మించాలని నిర్ణయించింది. 4 లక్షల ఇండ్లకు సంబంధించి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను ప్రారంభించాలని, ఇండ్ల నిర్మాణాన్ని వెనువెంటనే చేపట్టాలని ఆదేశించింది. ఒక్కో ఇంటికి మూడు విడతలుగా ప్రభుత్వం రూ.3లక్షలు గ్రాంట్‌గా ఇవ్వాలని నిర్ణయించిందని , ఈ డబ్బు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయడం జరుగుతుందన్నారు.
లబ్ధిదారుడు తన ఇంటిని తనకు నచ్చిన విధంగా కట్టుకునే విధంగా నిబంధనలను సులభతరం చేయాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఈ పథకానికి రూ.12వేలకోట్లు ఖర్చవుతాయని, ఈ మేరకు బడ్జెట్‌లో నిధులు కేటాయించామన్నారు హరీశ్ రావు. మంజూరు చేసే ఇండ్లన్నీ ఆ ఇంటికి సంబంధించిన ఇల్లాలిపైనే ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. గతంలో పేద వర్గాలకు గృహనిర్మాణ సంస్థ ద్వారా ఇళ్ల నిర్మాణానికి రుణాలు ఇచ్చారు. కాంగ్రెస్, తెలుగుదేశం హయాంలో ఇచ్చిన రూ.40వేలు, రూ.60వేలల్లో అప్పులు ఉండేవి. గతంలో అప్పులన్నీ మాఫీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాదాపు రూ.4వేలకోట్లు పేదలపై అప్పులుంటే.. ప్రభుత్వం రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నది.