‘‘ ఆ ఆ.. రండి బాబూ రండి త్వరపడండి.. ఆలోచించినా ఆశాభంగం.. కొనండి కొసర్లు వడ్డించుకెళ్ళండి.. ఇలాంటి ఆఫర్లు ఎప్పుడూ రావు.. ఇలా వచ్చినప్పుడు అలా వాడుకోవాలి, అందుకోవాలంతే.. ’’ అంటూ ఆటోల్లో, రిక్షాల్లో గొంతు చించుకొని మరీ చాటింపేసేవారు. తులాభారాలు, కిలోల కింద బట్టలు, ఒక లారీ పాత సామాను పట్టుకురండి రెండు లారీల కొత్త సామాన్లను పట్టుకెళ్ళండి వంటి.., కళ్ళు చెదిరే ఆఫర్లను విన్న జనాలు కొనకపోయినా వినైనా సంబురంగా ఫీలయ్యేవారు. ఇక నుండీ అలాంటి బంపర్ ఆఫర్లు బందైతున్నవి. ఒకటి కొంటే రెండు ఫ్రీ, రెండు కొంటే మూడు ఫ్రీ అనే అనే బెహెత్రీన్ ఆఫర్లు, జిగేల్ మనే ఫుల్ పేజీ యాడ్లు ఇక నుండీ కనపడవు ? వినపడవు ?? ఎవరైనా సాహసం చేసి ఆఫర్లిద్దామన్నా కుదరదంటే కుదరదంతే ! ఎందుకంటే GST దెబ్బతో ఇలాంటివి దెబ్బకు తోక ముడుస్తున్నవి. అమ్మిన వాటికి టాక్స్ చెల్లించాల్సిందే. ఉచితంగా ఇచ్చేవాటిక్కూడా టాక్స్ చెల్లించే రూలొచ్చింది. ఒకవేళ ఆఫర్లు ఇచ్చుకుంటే మాత్రం గవర్నమెంటు ఇన్ పుట్ సబ్సిడీ వుండదు ?
కాబట్టి వ్యాపారులు దిగారాక తప్పదు. చినిగిపోయిన బట్టలను ఆఫర్ల కింద అమ్మడం ఇప్పుడు సాగని తిరకాసు ముచ్చట. ఇప్పటికే GST అంటే చాలా మందికి అర్థం కాక తలలు పగులగొట్టుకుంటున్నారు. అంతో ఇంతో ఆనందాన్నిచ్చే ఆఫర్లు లేవంటే అటు వ్యాపారులు, ఇటు వినియోగదారులకు నిరాశే ? మన దగ్గర కూడా బిగ్ బజార్, మోర్, రిలయన్స్, మెబాజ్ వంటి పెద్ద పెద్ద స్టోర్లు ఆఫర్ల మతలబును మర్చిపోవాల్సిందే. ఇక పండగలకు, సీజన్లకిచ్చే ఆఫర్లు ఆగమైనట్టే. పండగకైనా – పబ్బానికైనా ఒకటే ధర – ఒకటే నియమం అని అందరూ ఆఫర్ల మీద ఆశలు వదులుకోవాల్సిందే ! ఈ GST మోత కేవలం బట్టల మీదే కాదు అన్నీ ఆఫర్ల మీద దీన్ని అప్లై చేస్తారట. అప్పుడు రివర్సులో ‘ ఆ రండి బాబూ రండి.. GST దెబ్బకు బంపర్ ఆఫర్లు బందైతున్నయి ’ అని ఉల్టా చాటింపేయాలేమో !?