GST new prices from today..these prices are more expensive
mictv telugu

నేటి నుంచి జీఎస్టీ కొత్త ధరలు..వీటి ధరలు మరింత ప్రియం

July 18, 2022

దేశవ్యాప్తంగా ఇప్పటికే మార్కెట్లో పెరిగిన పెట్రోల్, డీజిల్, కూరగాయలు, వంటనూనెలు, వంటగ్యాస్ వంటితో సతమతమవుతున్న సామాన్యులకు కేంద్ర ప్రభుత్వం మరో షాక్ ఇచ్చింది. నేటి నుంచి జీఎస్టీ కొత్త ధరలను అమల్లోకి తీసుకొచ్చింది. ఏఏ ఉత్పత్తులపై, సేవలపై ఎంతెంత శాతం నూతన జీఎస్టీ రేట్లను పెంచారో, ఆ వివరాలను ఓ ప్రకటన ద్వారా వెల్లడించారు. అంతేకాదు, పెంచిన ధరలు ఈరోజు నుంచే తక్షణమే అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు. మరి ఏ వస్తువులపై, వేటిపై ఎంతెంత శాతం రేట్లు పెంచారో తెలుసుకుందామా..

రేట్లు పెరిగిన ఉత్పత్తులు ఇవే..

బ్యాంకులు చెక్కుల జారీ కోసం వసూలు చేసే చార్జీపై 18 శాతం, మ్యాప్‌లు, చార్ట్‌లు, అట్లాస్‌లపైనా 12 శాతం, ప్రింటింగ్, రైటింగ్, డ్రాయింగ్ ఇంక్, చాకులు, పేపర్లను కత్తిరించే చాకులు, పెన్సిల్ షార్ప్‌నర్లు, ఎల్ఈడీ ల్యాంపులపై 18 శాతం, సోలార్ వాటర్ హీటర్లపై 12 శాతం, రహదారులు, వంతెనలు, రైల్వేలు, మెట్రోలు, అఫ్లూయంట్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లకు సంబంధించి కాంట్రాక్టు పనులు, శ్మశాన వాటికల సేవలపై 18 శాతానికి పెంచారు.

అంతేకాదు, ప్యాక్ చేసి విక్రయించే ఆహార ఉత్పత్తులు అంటే తినుబండారాలు, అప్పడాలు, మురుకులు, జంతికలు, మిక్చర్, పెరుగు, ఆసుపత్రుల్లో రూ.5,000కు మించిన రూమ్ రెంట్‌పై కొత్తగా 5 శాతం జీఎస్టీ వేశారు. ఇప్పటివరకు వీటిపై జీఎస్టీనే లేదు. వీటితోపాటు టెట్రా ప్యాక్‌లపై 18 శాతం జీఎస్టీని అధికారులు విధించారు.

ధరలు తగ్గినవి ఇవే..

రోప్ వేల ద్వారా వస్తువుల రవాణా, ప్రయాణికుల రవాణా సేవలపై 12 శాతం జీఎస్టీ రేటును 5 శాతానికి తగ్గించారు. వాయు మార్గంలో ఈశాన్య రాష్ట్రాల నుంచి, ఈశాన్య రాష్ట్రాలకు, బాగ్రోడియాకు తీసుకెళ్లే ప్రయాణికుల సేవలపై జీఎస్టీ మినహాయించారు. ట్రక్కులు, గూడ్స్ క్యారియర్ల అద్దెలపై సర్వీస్ చార్జీని 18 శాతం నుంచి 12 శాతానికి తగ్గించారు. ఎలక్ట్రిక్ వాహనాలు 5 శాతం రాయితీ జీఎస్టీ రేటుకు లభిస్తాయని గత నెలలో జరిగిన జీఎస్టీ కౌన్సిల్ 47వ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను అధికారులు వెల్లడించారు.