ఆ పని చాలా కష్టం బాసూ అన్న కేటీఆర్ - MicTv.in - Telugu News
mictv telugu

ఆ పని చాలా కష్టం బాసూ అన్న కేటీఆర్

March 10, 2018

వస్తుసేవల పన్ను(జీఎస్టీ) మోతకు జనం జేబులు ఎలా చిల్లుపడుతున్నాయో తెలిసిందే. తినే తిండి నుంచి కట్టే బట్టవరకు, చివరి చస్తే కాల్చే అగరొత్తులవకు జీఎస్టీ జీఎస్టీ.. ఈ పన్నుపోటు భరించలేక ఒక సామాన్యుడు ఐటీ మంత్రి కేటీఆర్‌కు మొరపెట్టుకున్నాడు. ఈ సమస్యను పరిష్కరించండి మహాప్రభో అని ట్విటర్లో వేడుకున్నాడు. అయితే అది తనకు కూడా చాలా కష్టమైన పని అంటూ కేటీఆర్ కూడా చేతులెత్తేశారు.ట్విటర్లో ఎన్నో సమస్యలకు, చిక్కుప్రశ్నలకు పరిష్కారాలు చూపిన కేటీఆర్‌ను ఇంత ఇబ్బంది పెట్టిన ఈ కథలోకి వెళ్దాం. ఎంబీ ప్రకాశ్ అనే వ్యక్తి.. జీఎస్టీ పోటును భరించలేక ఆ సమస్యను మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ‘కేటీఆర్ సార్… నేను శాఖాహారిని.  ఇడ్లీ, దోసె, అన్నం… ఇలా ఏది తిన్నా జీఎస్టీ కట్టాల్సి వస్తోంది. మా బోడుప్పల్ ప్రాంతంలో హోటళ్లను రాత్రి 10గంటలవరకే తెరిచి ఉంచుతారు. మరోపక్క.. నా మిత్రుడు హైదరాబాద్ పాతబస్తీ వెళ్లి మాంసాహారం తింటుంటాడు. అక్కడ బిర్యానీ తిన్నా, రోటీ తిన్నా జీఎస్టీ లేదు. మాలాంటి వాళ్ల కోసం హోటళ్లు 24 గంటలూ తెరిచే ఉంచేలా చూడండి. న్యాయం చేయండి సార్’ అని కోరాడు. ఈ వేదనపై కేటీఆర్ స్పందిస్తూ.. టఫ్ వన్ బాస్ బదులిచ్చారు!