ఇగ...ఇప్పుడు తెల్సిందా.... - MicTv.in - Telugu News
mictv telugu

ఇగ…ఇప్పుడు తెల్సిందా….

July 1, 2017

జీఎస్టీ తోని ఇంత మేలు అంత మేలు అని  ఉర్కి ఉర్కి తెల్సుకుని చేసేదేం లేదు. ఈ య్యాల్టి  సంది మనకే ఏర్కైతది. ఇంకో నాలుగు దినాలు ఆగితే యాడ ఎంత వెర్గింది… ఎవరికి వాతలు….. ఎవరి కోతలు అన్నీ తెల్సి పోతవి. అయినా మోడీ సారు దేశ జనాలకు ఏదో నేర్పుతా…. నేర్పుతా…. అన్నడు గద… ఇప్పటి వరకు  ఈ తరం జనాలు నేర్సుకోని కొత్త కొత్త పాఠాలు చెప్తున్నడు. డబ్బులు మీవే… బ్యాంకుల ఖాతా మీదే….. మీ ఖాతాల కెంచి ఎన్ని తిప్పల వడ్డా ఒక్క పైసా కూడా నీవు బయటకు తీసుకోలేవు.. బ్యాంకుల ముందు ఎన్ని దినాలు నీల్గినా పైసల్ వొస్తవనే గ్యారెంటీ లేదు.

నోట్ల దెబ్బలు… వాతలు ఇంకా మర్వనే లేదు. అంతట్లనే ఇప్పుడు జీఎస్టీ చెర్నా కోల తీస్కోని సురుక్కు మని అంటిచ్చిండు. దెబ్బ తుగులంగనే  ఎగిరితే ఎట్లా… జెర్ర ఆగితే ఏంత మేలు జర్గుతో చూడడండని బిజెపి నాయకులు చిల్క పల్కులు పల్కతనే ఉన్నరు.

నెల్లాల సంది జీఎస్టీతోని తినేట్వి… తాగేట్వి… పండేట్వి… ఎగిరిట్వి… దుంకేట్వి… ఉర్కేట్వి.. ఊరిచ్చేట్వి… ఇట్లా అన్నీ రకాల వొస్తువల రేట్లు… ఎట్లా తగ్గుతవో..ఏవీ ఎందుకు పెర్గుతవో కూడా పూస గుచ్చినట్లు కొంత మంది చెప్తే… గడ్డపార తీస్కోని పొడ్సినట్లు ఇంకింత మంది చెప్తున్నరు. ఎవరెట్ల…. ఏ భాషల చెప్పినా  దేశం అంతా ఒకటే ట్యాక్స్ ల  దినం  ఇయ్యాల్టి సంది షూరు అయింది. ఇగ తినేటోళ్లకు, తాగేటోళ్ల చుక్కలు కనవడ్డవా… జేబుల్ల దుడ్లు మిగిల్నవా ఏమైందనే విషయం మీ అంత మీకే  సమజ్ అయితది.

మన దేశ చరిత్రల ఇన్ని కోట్ల మందిని యేడాది  తిర్గతక ముందే ఎన్ని తీర్ల ఆలోసించేటట్లు చేసింది మోడీ సారు ఒక్కడే. జనాలకు కంటి మీద కునుకే కాదు… కొందరికైతే  వొంటి మీద సోయి లేకుండా.. తిండి తిప్పలు లేకుండా…. నోట్ల తిప్పలు, ట్యాక్స్ తిప్పలు తప్ప మరో ధ్యాస లేకుండా చేసిన ఏకక  నాయుడు మోడీనే. కొందరైతే ఇవేవీ పట్టించుకోకుండా  ముందుల ముందుల భవష్యత్తు బంగారం కంటే బాగా ఉంటుందని అనుకుంటున్నరు.

అయితే భవిష్యత్తు ఎట్లున్నా… ఇయ్యాల్టి సంగతి ఏందని  అడిగేటోళ్లు కూడా ఉన్నరు. అయితే ఇసోంటోళ్ల కోసమే… చేతుల్ల పైసల్ ఉంటే  ఇబ్బంది పడ్తరని… డిజిటల్ అన్నడు… అయినా  బ్లాక్ చేయాల్నినని ఎవ్వరన్న అనుకుంటే గిట్ల జిఎస్టీ దెబ్బకు ట్యాక్స్ లు రూపంల బయటకు తీస్కోనొస్తడు.

ఇప్పటి సంది ఏం కొన్నా… తిన్నా… తాగినా… చూసినా… రశీదులు తీసుకునేది మర్సిపోకండి… ఎందుకంటే నిన్నటి కంటే ఇయ్యాల… నెల కిందటి కంటే ఈనెలల ఏడ ఎంత పెర్గిందో… ఏడ ఎంత తగ్గిందో… ఏ పేపరు  చదవకుండా… టీవి చూడకుండా వాట్స్ ప్ మేస్సేజీలతోటి విసిగి పోకుండా అన్నీ మీకే అర్థం అయితవి.

అప్పుడు మోడీకి…ఆయన పెట్టిన జీఎస్టీకి థ్యాంక్స్ అంటరో…. గిజగిజ గుంజుకుంటరో మీ ఇష్టం.