ఎమ్మెల్సీ ఎన్నికల్లో సస్పెండ్‌కు గురైన ఎమ్మెల్యే శ్రీదేవిపై మంత్రి అమర్నాథ్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆదివారం నాడు మీడియాతో మాట్లాడుతూ.. ఆ రోజు ఎన్నికల్లో ఉండవల్లి శ్రీదేవి వైఖరి తనకు మొదటి నుంచి అనుమానం కలిగించిందని అన్నారు. పోలింగ్ సమయానికి ముందు శ్రీదేవి తన కూతురితో వచ్చి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డితో ఫోటో కూడా తీయించుకున్నారని చెప్పారు. ఆయన అభిమాని అని నమ్మించి మోసం చేయాలని భావించారని, ఆ రోజు ఆమె ఎంత హడావిడి చేశారో అందరూ చూశారని అన్నారు. సినిమా నటి శ్రీదేవి నటనను కూడా మైమరిపించే విధంగా ఆమె ఆ టైమ్ లో చాలా గొప్పగా నటించారన్నారు
అసలు సంగతి అప్పుడు తెలుస్తది
ఉండవల్లి శ్రీదేవి అనేదాని కంటే ఊసరవెల్లి శ్రీదేవి అని పేరు మార్చుకుంటే బెటరని సూచించారు. ఊసరవెల్లులు అన్నీ కలిసి పెద్ద ఊసర వెల్లి దగ్గరకు చేరుతున్నాయని విమర్శించారు. ఉండవల్లి శ్రీదేవి పసుపు కండువా కప్పుకుని జనంలోకి వెళ్లినప్పుడు.. అసలు సంగతి తెలుస్తుందని చెప్పారు. నాలుగేళ్లుగా కనిపించని లోపాలు ఇప్పుడు ఎలా బయటకు వస్తున్నాయని ప్రశ్నించారు. శ్రీదేవి లాంటి నమ్మకద్రోహుల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదన్నారు. కొద్ది రోజుల్లోనే చీకొట్టే స్థితికి చేరుకుంటారని తీవ్ర విమర్శలు చేశారు. రూ.10 కోట్ల రూపాయలు ఇస్తాము ఓటు వేయమని ఓటుకు నోటు ఆఫర్ చేశారని రాపాక వరప్రసాదే చెప్పాక.. కొత్త చర్చలేందుకని ప్రశ్నించారు.
బలుపు కాదది.. వాపు
తాజాగా కులం కార్డు అడ్డుపెట్టుకొని ఉండవల్లి శ్రీదేవి అందరి మీద విమర్శలు చేస్తున్నారని, ప్రతిపక్ష నాయకుల నుంచి భారీ మొత్తం తీసుకున్నప్పుడు కులం కార్డు గుర్తు రాలేదా? అని మంత్రి అమర్నాథ్ ప్రశ్నించారు. ఇదే సమయంలో మంత్రి ఆదిమూలపు సురేష్ సైతం ఎమ్మెల్యే శ్రీదేవిపై ధ్వజమెత్తారు. వాపును చూసి చంద్రబాబు బలుపు అనుకుంటున్నారని.. ఎమ్మెల్యేల కొనుగోళ్లలో ఆయన తీరులో మార్పు లేదని ఆరోపించారు. సాధారణ ఎన్నికల్లో వైసీపీదే గెలుపని ధీమా వ్యక్తం చేశారు.