క్రికెట్ పిచ్చి.. అయ్యోపాపం కొత్తజంట.. - MicTv.in - Telugu News
mictv telugu

క్రికెట్ పిచ్చి.. అయ్యోపాపం కొత్తజంట..

May 15, 2019

పెళ్లంటే బంధువులు, స్నేహితులతో కోలాహలంగా వుంటుంది. అందరూ వేదికపైకి వెళ్లి నూతన వధూవరులకు శుభాకాంక్షలు చెప్తారు. కానీ ఓచోట కొత్తజంటకు తీరని అవమానమే ఎదురైంది. పెళ్లికి వచ్చినవాళ్లంతా క్రికెట్ చూస్తూ వుండిపోయారు. ఒక్కరు కూడా రెప్ప వాల్చకుండా టీవీకే కళ్లు అప్పజెప్పారు తప్పితే నూతన వధూవరులకు శుభాకాంక్షలు చెప్పే పాపానికి పోలేదు. దీంతో పాపం వాళ్లు సంతోష సమయంలో దుఖ్ఖించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ విడ్డూరం హైదరాబాద్‌లోనే చోటు చేసుకుంది.  

వాళ్ల పెళ్లి విందు రోజే ఐపీఎల్ 2019 ఫైనల్ మ్యాచ్ ఉంది. దీంతో వేడుకకు వచ్చేవారి కోసం లైవ్ క్రికెట్ వీక్షించేలా స్క్రీన్‌ను ఏర్పాటు చేశారు. విందుకు వచ్చినవాళ్లంతా చక్కా భోజనాలు చేసి టీవీకేసి మొహాలు పెట్టి కూర్చున్నారు. ఒక్కరన్నా తమదగ్గరికి వచ్చి గ్రీటింగ్స్ చెప్తారని ఆశించిన ఆ నవ దంపతులకు తీవ్ర నిరాశే ఎదురైంది. మ్యాచ్ ఉత్కంఠగా సాగడంతో ఏ ఒక్కరూ వీళ్లను పట్టించుకోలేదు. చివరి వరకూ అందరి దృష్టి క్రికెట్‌పైనే వుంది. చివరికి ఒక్క రన్‌తో ముంబై ఇండియన్స్ గెలుపొందడంతో అంతా ఆనందోత్సాహంలో మునిగిపోయారు. ఈలలు వేశారు, డాన్సులు చేశారు.

అవన్నీ తమ ముందు చేస్తే ఇంకా ఆనందించేవాళ్లమనుకుని వధూవరులు మొహాలు చిన్నబుచ్చుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో చూసిన యూజర్లంతా అయ్యోపాపం కొత్తజంట అని విచారం వ్యక్తం చేస్తున్నారు. క్రికెట్ మ్యాచ్‌లు వున్నరోజు శుభకార్యాలకు దూరంగా వుంటేనే బెటర్ అని ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.