Guidelines for social media influencers in 10 days; fine up to Rs 50 lakh
mictv telugu

సోషల్ మీడియాలో ఫేక్ ప్రకటనలు పెడితే 10 లక్షల జరిమానా

September 8, 2022

చేతిలో ఓ స్మార్ట్ ఫోన్, అందులో సోషల్ మీడియా.. ఇక ఏదైనా చేయొచ్చు, ఏవైనా రాయొచ్చనుకుంటే ఇక నుంచి కుదరదు. అతి త్వరలో వాటికంటూ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ రాబోతున్నాయి. దీని ప్రకారం ఏదైనా బ్రాండ్‌కు ప్రచారం చేసే, ప్రభావితం చేసే వ్యక్తులు (ఇన్‌ఫ్లుయెన్సర్లు) స్పష్టమైన, వాస్తవ సమాచారాన్ని మాత్రమే అందించాల్సి ఉంది. అలాగే ఈ-కామర్స్ సైట్లలో ఆయా వస్తువులపై రివ్యూలు రాసేవారు కూడా ఇకపై ఆచితూచి నిజమైన కథనాలనే రాయాల్సి ఉంటుంది.

అలాకాకుండా ఇష్టం వచ్చినట్లు తప్పుడు ప్రకటనలు రాసి, నిబంధనలు ఉల్లంఘించినట్లయితే రూ. 10 లక్షల జరిమానా చెల్లించుకోక తప్పదు. నిబంధనలను పదేపదే ఉల్లంఘిస్తే మాత్రం రూ.50 లక్షల జరిమానా విధిస్తారు. సెలబ్రిటీ ఎవరైనా సరే ఈ జరిమానా కట్టి తీరాల్సిందే. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ మరో 15 రోజుల్లో ప్రామాణిక ఆపరేటింగ్ విధానం (ఎస్ఓపీ) పేరిట విడుదల చేయనుంది. తప్పుదోవ పట్టించే ప్రకటనల నుంచి ప్రజలను రక్షించేందుకే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.

బ్రాండ్‌ను ఎండార్స్ చేసేవారు, సోషల్ మీడియాను ప్రభావితం చేసేవారు, బ్లాగర్లను దీనికిందకు తీసుకురానుంది. అంతేకాదు, వస్తువులను ఉచితంగా తీసుకుని వాటిని ప్రచారం చేసేవారు, పొందిన వస్తువులకు ముందుగా 10 శాతాన్ని టీడీఎస్ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ తీసుకున్న వస్తువులను మళ్లీ తిరిగి వారికి అప్పగిస్తే కనుక సెక్షన్ 194 కింద ఆ మొత్తాన్ని తిరిగి పొందొచ్చు.