ప్రపంచమంతా వాలెంటైన్స్ డేని సరికొత్తగా జరుపుకోవాలనుకుంటారు. ఈ జంట కూడా అలాగే అనుకుంది. కొత్తగా ట్రై చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ను సొంతం చేసుకుంది.పీకల్లోతు ప్రేమలో మునిగారని ఊరికే అనరు జనాలు. అందుకే ఈ ప్రేమ జంట కూడా సముద్రపు లోతుల్లోకి వెళ్లారు. అక్కడితో ఆగలేదు.. వారి ప్రేమను ముద్దు రూపంలో వ్యక్తపరుచుకున్నారు. ఎక్కువ సేపు ముద్దు పెట్టుకొని ఇప్పుడు రికార్డు సంపాదించారు.
రికార్డు కోసం..
నీటిలో మునిగి ఒక నిమిషం ఉండడమే కష్టం. కాస్త ప్రాక్టీస్ ఉంటే మరో నిమిషం ఉంటారు. కానీ అంతకుమించి ఉండి మరీ రికార్డు కొట్టేశారు. బెత్ నీల్, మైల్స్ క్లౌటియర్ ప్రేమికుల దినోత్సవం కోసం మాల్దీవుల్స్ కి వెళ్లారు. అక్కడ లక్స్ సౌత్ అరి అటోల్ రిసార్ట్ లోని ఇన్సినిటీ పూల్ లో ఈ జంట నీటి అడుగున నాలుగు నిమిషాల ఆరు సెకన్ల పాటు ముద్దు పెట్టుకున్నారు. ఇది గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లోకెక్కింది. అయితే ఇంతకుముందు ఈ రికార్డు ఒక ఇటాలియన్ టీవీ షో డీ రికార్డ్ పేరు మీద ఉండేది. 13 సంవత్సరాల క్రితం ఒక జంట మూడు నిమిషాల 24 సెకన్లు ఉండి రికార్డు సృష్టించారు. వారి రికార్డును బెత్, మైల్స్ తిరగరాశారు.
ముందు ప్రయత్నం..
నీల్, క్లౌటియర్ విజయం అంతా ఈజీ కాలేదట. ఈ ఫీట్ కోసం మూడు రోజుల ముందు నుంచి ప్రాక్టీస్ చేసిందీ జంట. ఆ సమయంలో మూడు నిమిషాల మార్కును దాటలేకపోయారు. కానీ అదే ప్రేమికుల రోజున మాత్రం నాలుగు నిమిషాలకు పైగా తమ శ్వాసను పట్టుకోగలిగారు. ఈ జంట నీటి అడుగున ముద్దును వీడియోగ్రాఫర్ సైడ్ ది షార్క్ రికార్డ్ చేశారు. వారి రికార్డు చూడడానికి చాలామంది జనాలు కూడా వచ్చారు.
వారి గురించి..
నీల్.. క్లౌటియర్ కి ఒకటిన్నర సంవత్సరాల కుమార్తె నీవ్ ఉంది. వారిద్దరూ డైవర్లు. నివాసం.. దక్షిణాఫ్రికా. వారు మొదటిసారిగా ఐదు సంవత్సరాల క్రితం బెర్ముడాలో కలుసుకున్నారు. అక్కడ నీల్ ‘కిడ్స్ ఆన్ ది రీఫ్’ అనే ప్రోగ్రామ్ ను బోధిస్తున్నాడు. అతను పిల్లలకు ఎలా డైవ్ చేయాలో నేర్పించేవాడు. క్లౌటియర్ ఆ ప్రోగ్రామ్ కు సహాయం చేయడానికి స్వచ్ఛందంగా పాల్గొన్నది. ఆ పరిచయం వారి ప్రేమకు దారి తీసింది. అలా ఒక్కటయ్యారు. ఇప్పుడు జంట ఉచితంగా పిల్లలకు డైవింగ్ నేర్పుతుంది.