ఇలాగైతే బీజేపీ 2019లో ఓడిపోవడం ఖాయం! - MicTv.in - Telugu News
mictv telugu

ఇలాగైతే బీజేపీ 2019లో ఓడిపోవడం ఖాయం!

December 18, 2017

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు బీజేపీకి సంబరం కలిగించేవే. అయితే పార్టీలోపల అంతర్మథనం మొదలైంది. మెజారిటీ భారీగా తగ్గడానికి, కాంగ్రెస్ అనూహ్యంగా పుంజుకోవడానికి కారణం ఏంటని చర్చోపచర్చలు సాగుతున్నాయి. తప్పులు దిద్దుకోకపోతే 2019 ఎన్నికల్లో ఇబ్బంది పడకతప్పదని గుజరాత్ ఫలితాలు చెబుతున్నాయని అంటున్నారు.

మెజారిటీకి నిప్పుపెట్టిన పత్తి

గుజరాత్ గ్రామీణ ప్రాంతాల జనం కాంగ్రెస్‌కు బ్రహ్మరథం పట్టారు. చాలా జిల్లాల్లోని పల్లెల్లో కాంగ్రెస్ జెండానే ఎగిరింది. వ్యవసాయరంగంలో సంక్షోభం, నిరుద్యోగం.. బీజేపీని ఇరుకున పెట్టి, కాంగ్రెస్‌కు మేలు చేశాయి. పత్తి భారీగా పండే సౌరాష్ట్ర, కచ్ లలో పార్టీ అనూహ్య విజయాలను నమోదు చేసింది. వ్యవసారంగ దుస్థితి ఏమిటో కళ్లకు కట్టింది. ఆ ప్రాంతాల్లో 20 కేజీల పత్తిబేలు ధర 2012లో రూ. 1,400 ఉండగా, ప్రస్తుతం రూ. 600కు దిగజారిపోయింది. ఇతర పంటల ఉత్పత్తుల ధరలు కూడా భారీగా తగ్గాయి. రైతులు, రైతుకూలీలు, ఇతర అసంఘటిత వర్గాల ప్రజలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారు. 15 ఏళ్లుగా బీజేపీ ప్రభుత్వాలు కేవలం పట్టణ ప్రాంతాల అభివృద్ధివైపే దృష్టిసారించి, తమను నిర్లక్ష్యం చేయడాన్ని గ్రామీణులు జీర్ణించుకోలేకపోతున్నారు. సాక్షాత్తూ మోదీ సొంత జిల్లా మెహసానాలోని ఊంజా సీటులో కాంగ్రెస్ అలవోకగా గెలిచేసిందంటే పల్లెల్లో బీజేపీ పరిస్థితి ఏంటో తెలుసుకోవచ్చు.

ఇక పట్టణ ప్రాంతాల్లో మెజారిటీ సీట్లు బీజేపీ ఖాతాలోనే పడ్డాయి. రెండు దశాబ్దాలుగా ఎయిర్ పోర్టులు, రహదారులు వంటి మౌలిక సదుపాయాలు పెరడగంతో టౌన్ జనం మోదీకే జైకొట్టారు. జీఎస్టీ, నోట్ల రద్దు కొంత ప్రభావం చూపినా.. వ్యాపారుల మాత్రం మోదీపై నమ్మకం పెట్టుకున్నారు.

భారత దేశం ఇంకా వ్యవసాధారిత దేశం కనుక బీజేపీ ఈ ఫలితాల నుంచి గుణపాఠం నేర్చుకోవాల్సిన అవసరం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు. దేశవ్యాప్తంగా వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉందని, అభివృద్ధిని కేవలం పట్టణాలకు, నగరాలకే పరిమితం చేస్తే వచ్చే ఎన్నికల్లో ఎదురుగాలి తప్పదని హెచ్చరిస్తున్నారు.