గుజరాత్ లోని వడోదరకు చెందిన.. 24 ఏళ్ల క్షమాబిందు తనకు తానే స్వీయ వివాహం చేసుకోబోతున్నట్లు కొన్ని రోజుల క్రితం మీడియాలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నెల 11న పెళ్లి చేసుకోవాలని భావించిన ఆమె ఇప్పటికే శుభలేఖలు కూడా అచ్చువేయించింది. స్థానిక గోత్రి ఆలయంలో తన పెళ్లి జరగనుందని పేర్కొంది. అయితే ఆలయంలో ఇటువంటి పెళ్లిళ్లకు తాము అనుమతించలేమని ఆలయ వర్గాలు తేల్చి చెప్పడంతో కాస్త వెనుకడుగు వేసి ఇంటివద్దనైనా పెళ్లి చేసుకోవాలని భావించింది.
కానీ దురదృష్టవశాత్తు అది కూడా బెడిసికొట్టింది. ఇంటి వద్ద జరిగే ఆ పెళ్లి తంతును జరిపించలేనని పురోహితుడు హ్యాండిచ్చాడు. దీనిపై క్షమా బిందు ఓ వీడియోలో మాట్లాడుతూ, పురోహితుడు కూడా వెనక్కి తగ్గాడని, తన పెళ్లికి వేదిక కూడా లేకుండా పోయిందని వెల్లడించింది. ఆన్ లైన్ లో చూసి పెళ్లి మంత్రాలు చదువుతూ తన పెళ్లి తానే జరిపించుకుంటానని పేర్కొంది. అంతేకాదు, తన పెళ్లిని రిజిస్టర్ చేయించుకుంటానని చెబుతోంది.