మరికాసేపట్లో వరుడితో తాళి కట్టించుకోబోతున్న వధువు అకస్మాత్తుగా గుండెపోటుతో కుప్పకూలింది. పెళ్లిమంటపంలో విషాదం అలముకుంది. అయితే ఆమె కుటుంబం దుఃఖాన్ని దిగమింగుకుని పెళ్లిని యథవిధిగా జరిపించింది. పెళ్లికూతురి అంతిమ సంస్కారానికి ఏర్పాట్లు చేస్తూనే, ఆమె చెల్లెలిని వరుడికిచ్చి పెళ్లి చేసింది. ఈ భావోద్వేగమైన సంఘటన గుజరాత్‌లోని భావనగర్ జిల్లా సుభాష్ నగర్‌లో జరిగింది.
జినాభాయ్ జుకాభాయ్ అనే వ్యక్తి తన పెద్ద కూతురు హేతల్‌ను నారీ గ్రామానికి చెందిన విశాల్ భాయ్‌కి ఇచ్చి పెళ్లి చేయాలని మూహూర్తం పెట్టించుకున్నాడు. గురువారం పెళ్లి జరగాల్సి ఉంటుంది. విశాల్ తన బంధుమిత్రులతో బాణసంచా బరాత్ నడుమ సుభాష్ నగర్ చేరుకున్నాడు. మరికొన్ని గంటల్లో పెళ్లి జరగాల్సి ఉండగా హేతల్ గుండెపోటుతో స్పృహతప్ప పడిపోయింది.
ఆస్పత్రికి తరలించగా గుండెపోటుతో చనిపోయిందని వైద్యులు నిర్ధారించారు. వరుడుకి ఏం చేయాలో తోచలేదు. సంబంధం మంచిది కాదని, పెళ్లి తర్వాత చనిపోయి ఉంటే తమ పరిస్థితి ఏమిటని విశాల్ బంధువులు చెవులు కొరుక్కున్నారు. పరిస్థితిని గమనించి జుకాభాయ్ వరుడి కుటుంబం ఇబ్బంది పడకుండా, తన రెండో కూతురిని ఇచ్చి పెళ్లి చేస్తానని చెప్పాడు. దీనికి విశాల్ కుటుంబంబం అంగీకరించడంతో ఆ రోజే పెళ్లయిపోయింది. ఒకపక్క పెద్దకూతురి అంత్యక్రియలు, మరోపక్క రెండో కూతురి పెళ్లి నడుమ జుకాభాయ్ భావోద్వేగాలతో నలిగిపోయాడు.