Gujarat: Consumer forum orders marriage bureau to refund Rs 1 lakh for failing to find bride
mictv telugu

పిల్లను చూసి పెట్టలేదని మ్యారేజ్ బ్యూరోకి ఫైన్ వేసిన కోర్టు

July 7, 2022

మ్యారేజ్ బ్యూరోలు నడుపుతున్నవాళ్లు.. ఈ వార్త గురించి తెలుసుకొని తమ కస్టమర్లతో కాస్త జాగ్రత్తగా మసులుకోవాలి. మంచి సంబంధం ఉందని చెబుతూ.. ఫీజులు కింద లక్షల వరకూ వసూలు చేసి ఆ తర్వాత చేతులెత్తేస్తే.. సదరు కస్టమర్లు మీ మీద కూడా కేసు పెట్టే అవకాశముంది. అసలేం జరిగిందంటే.. గుజరాత్‌కు చెందిన శంకర్‌లాల్ అనే వ్యక్తి.. యోగ్యుడైన తన కుమారుడికి మంచి వధువు కావాలని స్థానికంగా ఉన్న ఓ మ్యారేజ్ బ్యూరోను సంప్రదించాడు. తన కుమారుడి వివరాలు చెప్పి, అందుకు ఫీజుగా లక్ష రూపాయలను చెల్లించి అక్కడ నుంచి వెళ్లిపోయాడు.

ఈ క్రమంలో కొద్ది రోజుల తర్వాత మ్యారేజ్ బ్యూరో నుంచి ఫోన్ రావడంతో.. తన కుమారుడితో సహా అక్కడికి వెళ్లి, వాళ్లు చూపించిన అమ్మాయి ఫొటోను చూసి ఓకే చెప్పేశారు. సంబంధం ఖాయం చేయమని చెప్పి ఇంటికి తిరుగుపయనమయ్యారు. ఆ తర్వాత కొన్ని రోజులకు వాళ్లు మళ్లీ ఫోన్ చేసి… ఆ అమ్మాయికి ఇది వరకే పెళ్లైపోయిందని.. వేరే సంబంధం ఉందని చెప్పారు. దీంతో అతడు.. కొడుకుతో సహా మ్యారేజ్ బ్యూరోకి వెళ్లి.. కొత్తగా చూపించిన అమ్మాయి ఫోటోని ఓకే చేసి, వివరాలు కనుక్కోమని చెప్పి తిరిగి ఇంటికి వచ్చేశారు. అలా చెప్పి వచ్చిన తర్వాత మ్యారేజ్ బ్యూరో నుంచి ఎటువంటి ఫోన్ రాలేదు. ఈ క్రమంలో ఏడాది గడిచిపోయింది. దీంతో శంకర్ లాల్‌కు ఒళ్లు మండిపోయి.. మ్యారేజ్ బ్యూరోకు వ్యతిరేకంగా కన్జ్యూమర్ కోర్టును ఆశ్రయించాడు. ఇరువురి వాదనలు విన్న కోర్టు.. సదరు మ్యారేజ్ బ్యూరోకి షాకిచ్చింది. ఫీజు కింద తీసుకున్న లక్ష రూపాయలను శంకర్‌లాల్‌కు తిరిగి ఇచ్చేయాలని ఆదేశించింది. అంతేకాకుండా రూ.5వేల జరిమానా కూడా విధించింది. కాగా.. కోర్టు తీర్పు స్థానికంగా హాట్ టాపిక్ అయింది.