Home > Featured > గుజరాత్ ఎన్నికలకు సర్వం సిద్ధం.. మరికాసేపట్లో పోలింగ్

గుజరాత్ ఎన్నికలకు సర్వం సిద్ధం.. మరికాసేపట్లో పోలింగ్

గుజరాత్ ఎన్నికలకు సర్వం సిద్ధం అయింది. తొలి విడతలో మొత్తం 19 జిల్లాల్లోని 89 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. దక్షిణ గుజరాత్, కచ్-సౌరాష్ట్ర ప్రాంతాల్లోని జిల్లాలో ఎన్నికలు జరగనున్నాయి. బీజేపీ, కాంగ్రెస్, ఆప్ మధ్యలో త్రిముఖపోరు నెలకొంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎన్నికలు జరగనున్నాయి. ఆ రాష్ట్రంలో మొత్తం 4,91,35,400 మంది ఓటర్లలో మొదటి దశ ఎన్నికల్లో 2,39,76,670 మంది ఓటు వేయనున్నారు. మొత్తం 14,382 పోలింగ్‌ కేంద్రాల్లో ఓటింగ్‌ జరుగుతుందని, అందులో 3,311 పట్టణాల్లో, 11,071 గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయని ఎన్నికల సంఘం ఒక ప్రకటనలో తెలిపింది.

ఎన్నికలను అన్ని పార్టీలూ సవాలుగా తీసుకున్నాయి. అధికారంలో ఉన్న బీజేపీ.. కేంద్రంలో మళ్లీ అధికారంలోకి రావాలంటే ఈ ఎన్నికల్లో గెలిచి తీరాలనే పట్టుదలతో ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సొంత రాష్ట్రం కూడా కావడంతో ఆ పార్టీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అక్కడ పార్టీ ఓడితే.. అది కేంద్రంలో బీజేపీకి ఎదురుదెబ్బలా ఉంటుంది. అందుకే ఈ ఎన్నికల్లో మోదీ.. విస్తృత ప్రచారం చేశారు.

ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్‌ కూడా ఈ ఎన్నికలపై ఎక్కువ ఫోకస్ పెట్టింది. ఇందులో గెలవడం ద్వారా దేశవ్యాప్తంగా మళ్లీ పుంజుకోవాలన్నది ఆ పార్టీ ప్లాన్. కొన్నేళ్లుగా ప్రతిపక్షంగా ఉన్న ఆ పార్టీ.. ప్రభుత్వ వ్యతిరేకత తమకు కలిసొస్తుందని అనుకుంటోంది. అటు గుజరాత్ ఎన్నికల సమరంలో తొలిసారి ఎంట్రీ ఇచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్).. గుజరాత్‌లో బోణీ కొట్టాలని చూస్తోంది. పంజాబ్ తరహాలోనే ఇక్కడ కూడా ప్రజలు తమను ఆదరిస్తారని ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ భావిస్తున్నారు. ఐతే.. ఆప్ ఎంట్రీ వల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓటు కాంగ్రెస్, ఆప్ మధ్య చీలిపోయి.. తమకు కలిసొస్తుందని బీజేపీ అనుకుంటోంది. ఇలా త్రిముఖపోరు.. ఆసక్తి రేపుతోంది. రెండో విడత ఎన్నికలు డిసెంబర్ 5న 93 స్థానాలకు జరగనున్నాయి. డిసెంబర్ 8న ఫలితాలు విడుదల కానున్నాయి.

Updated : 30 Nov 2022 10:08 PM GMT
Tags:    
Next Story
Share it
Top