Gujarat: Fallen soldier’s family refuses to accept ‘Shaurya Chakra’ sent by post, calls it ‘insult’
mictv telugu

శౌర్య చక్ర మెడల్‌ను తిరస్కరించిన వీరసైనికుడి కుటుంబం

September 9, 2022

తమ కుమారుని వీరమరణానికి గుర్తింపుగా సర్కారు పంపిన మూడో అతిపెద్ద సైనిక పురస్కారాన్ని ఆ తల్లిదండ్రులు తిరస్కరించారు. గౌరవప్రదంగా రాష్ట్రపతి భవన్‌లో రిపబ్లిక్‌ దినోత్సవం నాడో, స్వాతంత్య్రం దినోత్సవం నాడో .. రాష్ట్రపతి చేతుల మీదుగా అందజేయాల్సిన మెడల్‌ను పోస్టులో పంపడంతో ఆ కుటుంబం ఆగ్రహం వ్యక్తం చేసింది. జమ్ముకశ్మీర్‌లో ఐదేండ్ల క్రితం ఉగ్రవాదులతో పోరాడుతూ కన్నుమూసిన లాన్స్‌ నాయక్‌ గోపాల్‌సింగ్‌ భదోరియాకు సర్కారు మూడో అతిపెద్ద సైనిక పురస్కారమైన శౌర్యచక్రను ప్రకటించింది. అయితే లాంఛనంగా జరిగే పురస్కారాల ప్రదానోత్సవంలో రాష్ట్రపతి చేతుల మీదుగా కాకుండా పోస్టులో పంపడం తన కుమారుని స్మృతిని అవమానించడమేనని తండ్రి మునీంసింగ్‌ అన్నారు. ఆయన గుజరాత్‌ రాజధాని అహ్మదాబాద్‌లోని బాపూనగర్‌లో నివాసముంటున్నారు.

ఈ సందర్భంగా “ఆర్మీ పతకాన్ని పోస్ట్ ద్వారా పంపదు. ఇది ప్రోటోకాల్‌ను ఉల్లంఘించడమే కాకుండా.. అమరవీరుడిని, అతని కుటుంబాన్ని అవమానించడమే. అందుకే పతకం ఉన్న పార్శిల్‌ను నేను అంగీకరించలేదు. నేను దానిని అంగీకరించలేను అని దానిని తిరిగి ఇచ్చేశాను” అని మునీంసింగ్ చెప్పారు.

అయితే అవార్డును పోస్టులో పంపడం వెనుక ఓ కారణముంది. అమర జవాన్‌ లాన్స్‌ నాయక్‌ సింగ్‌ తన భార్యతో విడిపోయాడు. కోర్టులో వ్యవహారం నడిచింది. తీర్పు వెలువడే లోగా ఆయన కశ్మీర్‌లో ప్రాణాలు వదిలాడు. తమ కుమారునితో విడిపోయిన కోడలు ఆ అవార్డు, దానితోపాటే ఇచ్చే ఇతర పారితోషికాలు అందుకోవడానికి వీల్లేదంటూ మునీంసింగ్‌ కోర్టులో కేసు వేసి స్టే తెచ్చుకున్నాడు. ఈ లోగా విడాకుల కేసులో తీర్పు వచ్చింది. దీంతో అవార్డును రాష్ట్రపతి భవన్‌లో తనకే ఆందజేయాలని ఆయన కేంద్రానికి లేఖలు రాశాడు. కానీ కేంద్ర ప్రభుత్వం పోస్టులో పంపింది.