Gujarat: Giant crocodile seen dragging man's body in Dhadhar river
mictv telugu

నదిలో దిగిన యువకుడిపై మొసలి దాడి.. ఫోన్లలో షాకింగ్ వీడియో

August 9, 2022

స్నానం కోసమని నదిలోకి దిగిన ఆ యువకుడిపై.. నీటిలో ఉన్న మొసలి అకస్మాత్తుగా దాడి చేసింది. ఊహించని ఈ హఠాత్పరిణామంతో ఆ యువకుడు మొసలి బారి నుంచి తప్పించుకోవడానికి చాలా ప్రయత్నించాడు. కానీ దాని పదునైన పళ్లతో యువకుడిని నోటకరుచుకున్న మొసలి అతన్ని వదిలిపెట్టలేదు. ఇదంతా ఒడ్డున ఉన్న స్థానికులు చూస్తుండగానే జరిగింది. అక్కడే ఉన్న కొందరు ఆ భయానక దృశ్యాలను స్మార్ట్ ఫోన్లలో రికార్డ్ చేశారు. ఆ వీడియోని ఒళ్ళు గగుర్పొడిచేలా ఉంది. మొసలి దాడిలో చివరకు ఆ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన గుజరాత్‌లోని వడోదరలో ఆదివారం చోటు చేసుకుంది.

పద్రా తాలూకాలోని సోఖ్దారఘు గ్రామానికి సమీపంలో ధధర్ నదిలో ఇమ్రాన్ దివాన్ (30) అనే వ్యక్తి స్నానానికి దిగాడు. ఆ సమయంలో అతడిని ఓ మొసలి ఒక్కసారిగా నీళ్ళలోకి లాక్కువెళ్ళింది. ఆ తర్వాత అతడిపై మొసలి దాడి చేయడం ప్రారంభించింది. ఈ దృశ్యాలను స్థానికులు స్మార్ట్ ఫోన్లలో తీశారు. స్థానిక అధికారులకు వారు సమాచారం అందించారు. దాడి జరిగిన వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (NDRF) ఆదివారం సాయంత్రం సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించింది. గత రాత్రి 11 గంటల ప్రాంతంలో మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నట్లు అటవీ అధికారి తెలిపారు.

“మృతుడిని దివాన్ ఇమ్రాన్‌భాయ్ అలీషాగా గుర్తించారు. పోస్టుమార్టంలో పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. నదిలో మృతదేహాన్ని వెలికితీసే సరికి అతడి భుజాలు మొసలి దాడిలో చాలావరకు నలిగిపోయాయి”అని వడోదర డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (DCF) రవిరాజ్‌సింగ్ రాథోడ్ తెలిపారు. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు.