ఇంటింటికీ బ్రీత్ ఎనలైజర్లు.. మద్యం తాగారో పెళ్లి క్యాన్సిల్..  - MicTv.in - Telugu News
mictv telugu

ఇంటింటికీ బ్రీత్ ఎనలైజర్లు.. మద్యం తాగారో పెళ్లి క్యాన్సిల్.. 

October 30, 2019

Gujarat.

మద్యం తాగొద్దని ఎంత మర్యాదగా చెప్పినా ఎవరైనా వింటారా? సమస్యే లేదు.. ఎవ్వరూ వినరు. పైగా చెప్పినవారిని జోకర్‌ను చూసినట్టు లుక్ ఇస్తారొకటి. తాగుబోతుల ఇలాంటి వైఖరి వల్ల సంపూర్ణ మద్యపాన నిషేధం అనేది ఈ జన్మకు సాధ్యం కాకుండాపోతోంది. మరి దీనికి అంతమే లేదా? ఎందుకు లేదూ.. ఉంది అంటున్నారు ఓ గ్రామస్తులు. గ్రామస్తులందరూ కలిసి ఓ వినూత్నమైన, కఠినమైన నిబంధనను అమలు పరుస్తున్నారు. దీంతో గ్రామంలో తాగుబోతులు మందు జోలికి పొమ్మన్నా పోవడం లేదు. ఇంతకీ వారు ఏం చేశారంటే.. పెళ్లితో మందుకు ముడిపెట్టారు. పెళ్లికి మందుతో లింకా అని తర్జనభర్జనలు పడకండి. పెళ్లి చేసుకునే యువకుడు తాగాడా ఇక అంతే.. పెళ్లి క్యాన్సిల్. 

ఇంతకీ ఆ గ్రామం పేరు చెప్పుకోలేదు కదూ. అక్కడికే వస్తున్నాం.. మద్యపాన నిషేధంలో పాస్ మార్కులు కొట్టేసిన ఆగ్రామం పేరు పియాజ్. గుజరాత్‌ రాష్ట్రంలో ఉంది. నిశ్చితార్థం నుంచీ పెళ్లి వరకూ పెళ్లి కొడుకుతో పాటు ఆ కుటుంబంలోని మగవారందరూ బ్రీత్‌ఎనలైజర్ టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఏ సమయంలో అయినా టెస్ట్‌లో ఫెయిలైతే అంతే.. పెళ్లిని నిర్దాక్షిణ్నంగా రద్దుచేస్తారు. దయ, జాలి, కుటుంబ పరువు వగైరా పట్టింపులు ఏవీ పట్టించుకోరు. తాగిన యువకుడు పెళ్లి మీద ఆశ వదులుకోవాల్సిందే. ఇందు కోసం పెళ్లికూతురు తరఫువారు గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తారు. దాదాపు 25 మందిని రంగంలోకి దింపి బ్రీత్‌ఎనలైజర్‌ టెస్ట్‌లు చేయిస్తారు. పెళ్లి సమయంలో మద్యం పుచ్చుకుని ఎవరైనా దొరికితే పెళ్లి క్యాన్సిల్ అంతే. వేరే ముచ్చటే లేదిక.  

అంతేకాకుండా పెళ్లి కొడుకు లక్ష రూపాయల జరిమానా కూడా చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఆ గ్రామంలోని యువకులు 13 సంవత్సరాల వయసులోనే మద్యానికి బానిసలు అవుతున్నారు. చేతికొచ్చే సమయానికి కాలం చేస్తున్నారు. దీంతో పెళ్లైన మహిళలు చిన్నతనంలోనే భర్తను కోల్పోవాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. అందుకే ఆ గ్రామం ఈ కట్టుబాటును అమల్లోకి తీసుకువచ్చింది. ఈ దెబ్బతో ఆ గ్రామంలో చాలామంది మందును చూసి పారిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. పెళ్లి, పెళ్లాం, పిల్లలతో ఎంచక్కా జీవితాన్ని ఆనందంగా గడుపుదాం అని గ్రామస్తులంతా ఒక్కతాటి పైకి వచ్చారు. చిత్రంగా ఉంది కదూ.. ఈ ఐడియా మన ఊళ్లల్లోనూ పాటిస్తే తప్పకుండా ఫలితాలు వస్తాయి అని అనిపిస్తోంది కదూ.