మోదీ పేరు చెప్పుకుని మోసగాడి సూపర్ స్కెచ్..
చెట్టు పేరు చెప్పుకుని కాయలు అమ్ముకునే రకం అని ఒక సామెత ఉంది కదా. అలాంటి వ్యవహారాలు రాజకీయాల్లో చాలా మామూలే. పెద్ద వాళ్ల పేరు చెప్పి బెదిరింపులు, దందాలు, మరెన్నో ఘోరాలు నేరాలు చేస్తుంటారు. గుజరాత్‌కు చెందిన ఓ మోసగాడు అలాంటివేమీ చేయకపోయినా ఏదో ‘దూల’తో ఆర్మీకే మస్కా కొట్టి చిక్కుల్లో పడ్డాడు. తాను ప్రధానమంత్రి కార్యాలయంలో అదనపు డైరెక్టర్‌గా పనిచేస్తున్నాని చెప్పి, జెడ్ ప్లస్ భద్రతతో కశ్మీర్ బార్డర్‌కు వెళ్లిన ఈ కేటుగాడిని అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు.
గుజరాత్‌కు చెందిన కిరణ్ భాయ్ పటేల్ తను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆఫీసులో ‘వ్యూహాలు, ప్రాచారాల’ విభాగం అదనపు డైరెక్టర్‌నని ఫోర్జరీ పత్రాలు సృష్టించి ఈ నెల తొలివారంలో కశ్మీర్ వెళ్లాడు. ఆ రాష్ట్ర అధికారులు అతని దర్జా, ఐడెంటిటీ కార్డులు అవీ చూసి నిజమేనేమో అనుకుని పెద్దపెద్ద మర్యాదలు చేశారు. బుల్లెట్ ఫ్రూఫ్ వాహనంలో సరిహద్దులోని ఆర్మీ స్థవరానికి, పర్యాటక కేంద్రాలకు తీసుకెళ్లారు. లగ్జరీ హోటళ్లలో బస ఏర్పాటు చేశారు. కిరణ్ ఆ టూర్లలో తీసుకున్న ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియాతో పంచుకున్నాడు. తర్వాత రెండు వారాలు తిరగకముందే మళ్లీ ఛలో కశ్మీర్ అన్నాడు. అక్కడి ఉన్నతాధికారులు ఏదో డౌట్ కొట్టింది. కిరణ్ వ్యవహారం తేడా కనిపించడంతో నిఘా వర్గాలకు సమాచారం అదించారు. అటు ఢిల్లీలోను, ఇటు గుజరాత్‌లో అతని వివరాలు సేకరించి ‘ఫేక్’ అని తేల్చారు. కశ్మీర్ పోలీసులు అరెస్ట్ చేయగా కోర్టు రిమాండుకు పంపింది. అతనిపై ఐపీసీ 429 సహా పలు సెక్షన్ల కింద కేసులు పెట్టారు. కిరణ్ కేవలం షికారు కొట్టడానికే కశ్మీర్ వెళ్లాడా, లేకపోతే ఆర్మీ గుట్టుమట్లు సేకరించి అమ్ముకోవడానికి వెళ్లాడా అనే దర్యాప్తులో లేలుతుందని పోలీసులు చెప్పారు.