Gujarat Manifesto Tention In BJP
mictv telugu

గీత దాటుతారా? మరిపించేలా మ్యాజిక్ చేస్తారా?

November 23, 2022


ఉచితాలకు వ్యతిరేకమనే వాదనకు కట్టుబడి ఉంటారా?లేదా ఈసారికి గీత దాటుతారా?కాంగ్రెస్ , ఆప్ తాయిలాలను మరిపించేలా ఏదైనా చేస్తారా?గుజరాత్‌లో బీజేపీ ఏం చేయబోతోంది?మేనిఫెస్టో ఎలా ఉండబోతోంది?తప్పదంటూ ఉచితాలు ప్రకటిస్తారా అనేది ఆసక్తిగా మారింది.

అగ్నిపరీక్ష
గుజరాత్ ఎన్నికలు డిసెంబర్ 1,5న రెండువిడతల్లో జరుగుతాయి. 8న ఫలితాలను లెక్కిస్తారు. ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతుంది. ప్రచారంలో ముందున్న బీజేపీ మేనిఫెస్టోలో వెనుకపడింది. ఆప్, కాంగ్రెస్‌లు పోటీపడి మరి ఉచితాలను ప్రకటించాయి. జనాల్ని ఆకర్షించే విధంగా ఈ హామీలు ఉన్నాయి. బీజేపీని ఇరుకున పెట్టేందుకు ముందే తెలివిగా విపక్షాలు వరాల వర్షం కురించాయి. ప్రచారంలో దూసుకుపోతున్న బీజేపీ…కాంగ్రెస్ , ఆప్ మేనిఫెస్టోలు చూసి జడుసుకుంది. ఇప్పుడు ఏం చేయాలోనని సంకటంలో పడింది.

ఉచితాలకు వ్యతిరేకమే..కానీ…

ఉచిత పథకాల్ని బీజేపీ వ్యతిరేకిస్తోంది. పలుమార్లు ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఇదే విషయాన్ని చెప్పారు. పార్టీలు ఇచ్చే ఉచిత హామీలపై అప్రమత్తంగా ఉండాలన్నారు. అందుకే ఆ పార్టీ ఓ లైన్ పెట్టుకుంది. ఉచితాల్ని ప్రోత్సాహించొద్దని నిర్ణయించింది. గుజరాత్‌లో మాత్రం ఈ విషయంలో కఠిన పరీక్షని ఎదుర్కోంటోంది. ఉచితాల్ని ఇవ్వకపోతే ఓటర్లను ఆకట్టుకోలేరు. ప్రత్యర్థి పార్టీల్నే ప్రజలు నమ్మే అవకాశం ఉంది. ఏడోసారి రికార్డ్ విజయానికి కాస్తా ఇబ్బంది అవుతుంది. దీంతో ప్రజలకోసం ఓ మెట్టు దిగాలని బీజేపీ ఆలోచిస్తోంది. పార్టీ లైన్ దాటడానికి సిద్ధమవుతోంది. కాంగ్రెస్ , ఆప్‌లను మించి ఉచిత హామీలు కాకపోయినా ప్రజలకు అవసరమైన వాటిని ఇవ్వాలని యోచిస్తోంది. అందుకే గుజరాత్ మేనిఫెస్టోను బీజేపీ ఇప్పటిదాకా ప్రకటించలేదు.

అగ్రేసర్ ఆదుకునేనా?
రాష్ట్రాన్ని మెరుగుపర్చేందుకు ఏం చేయాలో సూచనలు స్వీకరించడానికి అగ్రేసర్ గుజరాత్ కార్యక్రమాన్ని బీజేపీ నిర్వహించింది. పల్లెలు, పట్టణాల్లో బాక్సులు పెట్టింది. మెయిల్ ద్వారా సూచనల్ని ఆహ్వానించింది. వీటిని పరిశీలించాక మేనిఫెస్టోని విడుదల చేయబోతోంది. ఉచిత విద్యుత్ అంశం బీజేపీని కలవరపెడుతోంది. ఆప్ , కాంగ్రెస్ ఇచ్చిన ఈ హామీ జనాల్ని ఆకర్షిస్తోంది. ఇంతకుమించి ఏం చేయాలని బీజేపీ ఆలోచిస్తోంది. ఉచిత విద్యుత్ కష్టమైనా ఇచ్చి తీరాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే రెండు ఉచిత గ్యాస్ సిలిండర్లు, ఉమ్మడి పౌరస్మృతి చట్టంలాంటి హామీలు మేనిఫెస్టోలో ఉంచబోతుంది. ఈసారి రికార్డ్ స్థాయి విజయంపై కన్నేసిన బీజేపీ..ఉచితాల విషయంలో లైన్ క్రాస్ చేయాలని చూస్తోంది. లేదంటే తాము ఆశించిన ఫలితాలు రావని బీజేపీ విశ్లేషించుకుంటోంది.