Gujarat police arrested six Pakistani nationals who were smuggling drugs
mictv telugu

పాకిస్తాన్ కుట్ర భగ్నం.. 200 కోట్ల డ్రగ్స్ సహా ఆరుగురి అరెస్ట్

September 14, 2022

పాకిస్తాన్ చేసిన భారీ కుట్రను పోలీసులు ఛేదించారు. దేశంలోకి డ్రగ్స్ సరఫరా చేయాలన్న ఆ దేశ పన్నాగాన్ని పసిగట్టి రూ. 200 కోట్ల విలువైన డ్రగ్స్, ఆరుగురు పాకిస్తానీ పౌరులను అరెస్ట్ చేశారు. గుజరాత్‌లోని సముద్ర తీర ప్రాంతంలో గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్, కోస్ట్ గార్డ్ సంయుక్తంగా చేసిన ఆపరేషన్ విజయవంతమయింది. పాక్ నుంచి ఫిషింగ్ బోటులో మాదకద్రవ్యాలను తరలిస్తున్నారని సమాచారం అందగా, సముద్రం మధ్యలో మాటువేసిన పోలీసులు వారిని పట్టుకొని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 40 కిలోల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. జఖౌ హార్బర్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు అధికారులు వెల్లడించారు. ఆరుగురిని విచారించగా, డ్రగ్స్‌ను తొలుత గుజరాత్‌కు చేర్చి ఆ తర్వాత అక్కడ నుంచి పంజాబ్‌కు తరలించాలనుకున్నట్టు తెలిపారు. స్వాధీనం చేసుకున్న పడవ, వ్యక్తులు, డ్రగ్స్‌తో బుధవారం తీరానికి చేరుకునే అవకాశం ఉంది. కాగా, గత కొంతకాలంగా పాకిస్తాన్ పంజాబ్‌లో డ్రగ్స్ సరఫరాను విపరీతంగా పెంచింది. రోడ్డు మార్గం ద్వారా రవాణా సాధ్యం కాకపోవడంతో డ్రోన్ల ద్వారా చేరవేసేందుకు ప్రయత్నించింది. అది కూడా విఫలం అవడంతో ఇప్పుడు కొత్తగా సముద్ర మార్గాన్ని ఎంచుకొందని అంతర్జాతీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.