జేసీబీలు అడ్డుపెట్టి.. రాడ్లతో కొట్టి నేరగాళ్ల అరెస్ట్.. వీడియో వైరల్
గుజరాత్ పోలీసులు సినీఫక్కీలో నేరగాళ్లను పట్టుకున్నారు. ఘటనను వీడియో తీసిన పోలీసులు సోషల్ మీడియాలో పెట్టడంతో అది వైరల్‌గా మారింది. పోలీసులు, వీడియో ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. సూరత్‌కు చెందిన ఓ ముఠా నేరాలు చేస్తూ కొంతకాలంగా పోలీసులను ముప్పుతిప్పలు పెడుతోంది. ఎప్పుడైనా పోలీసులు పట్టుకుంటే వారిని కొట్టేసి మరీ తప్పించుకుపోతున్నారు. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన సూరత్ క్రైం బ్రాంచ్ పోలీసులు వారిని పట్టుకునేందుకు పక్కా స్కెచ్ వేశారు. ఓ కారులో ముఠా సభ్యులు ప్రయాణిస్తున్నారని గ్రహించిన పోలీసులు వారు వెళ్లే దారిలో తప్పించుకోకుండా జేసీబీలను అడ్డం పెట్టారు. కిలోమీటరు దూరంలో వీరు వాహనాలలో ఉంటూ ముఠా రాక కోసం వేచి చూస్తున్నారు. ఇంతలో ముఠా కారు రానే వచ్చింది. దాంతో ఒక్కసారిగా దానిపై దాడి చేసిన పోలీసులు కారు అద్దాలను రాడ్లతో కొట్టి పగులగొట్టారు. లాఠీలు, కర్రలతో విచక్షణారహితంగా దాడి చేశారు. దీంతో భయపడిపోయిన నేరస్థులు తమ కారును ముందుకు పోనివ్వగా అక్కడ జేసీబీలు ఉండడంతో కారును ఆపేశారు. ఇటు పోలీసుల దాడి ఎక్కువవడంతో కారును వెనక్కి తోలే ప్రయత్నం చేశారు. కానీ, అప్పటికే వెనుక కూడా పోలీసుల వాహనం ఉండడంతో వారికి తప్పించుకునే అవకాశం లేకుండా పోయింది. దీంతో ముఠా సభ్యులు పోలీసులకు చిక్కిపోగా, వారు తమపై చేసిన దాడులను గుర్తు చేస్తూ వారిని దూషిస్తూ, జుట్టుపట్టుకొని పోలీసులు ఈడ్చుకెళ్లారు. అనంతరం జీపులో ఎక్కించి స్టేషనుకి తరలించారు.
https://www.ap7am.com/flash-news-747160/surat-crime-branch-nabbed-some-members-of-the-cheeklighar-gang