Gujarat Polls: BJP Suspends 12 Rebels Fighting As Independents
mictv telugu

బీజేపీకి రెబల్స్ బెడద

November 23, 2022

గుజరాత్ బీజేపీని రెబల్స్ బెడద వణికిస్తోంది. 12 సీట్లలో రెబల్స్ స్వతంత్రులుగా బరిలోకి దిగారు. ఇందులో ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మధు శ్రీవాస్తవ్ ఉన్నారు. పార్టీ అధిష్ఠానం చేసిన బుజ్జగింపులు ఫలించకపోవడంతో 12 మంది నాయకులపై బీజేపీ వేటు వేసింది.రికార్డ్ విజయంపై కన్నేసిన బీజేపీకి రెబల్స్ బెడద వణికిస్తుందా? ఆ 12 నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థుల గెలుపుపై ప్రభావం పడుతుందా?

కమలంలో కలవరం

గుజరాత్ ఎన్నికల్ని ప్రధాని మోదీ, కేంద్రహోంమంత్రి అమిత్ షా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఏడోసారి గెలిచి రికార్డ్ సృష్టించాలని యాక్లన్ ప్లాన్ సిద్ధం చేశారు. సొంత ఇలాకాలో చరిత్ర తిరగరాయాలని చూస్తున్నారు. దీనికోసం ప్రధాని మోదీ, అమిత్ షాలు సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. బీజేపీ కార్యకర్తలు, నాయకుల్లో జోష్ నింపుతున్నారు. కానీ రెబల్స్ బెడద వీరిని కలవరపెడుతోంది.38 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు బీజేపీ టికెట్ ఇవ్వలేదు. కొంతమంది పార్టీని వీడితే మరికొంతమంది స్వతంత్రులుగా బరిలో నిలిచారు.12 నియోజక వర్గాల్లో పోటీ చేస్తున్నారు. తొలి విడతలో ఏడుగురుపై బీజేపీ వేటు వేసింది. రెండో విడతలో 12 మందిని సస్పెండ్ చేసింది.

రెబల్స్ సవాల్

రెండో విడత నామినేషన్ల ఉపసంహరణకు ఈనెల21తో గడువు ముగిసింది. డిసెంబర్ 5న 93 స్థానాల్లో పోలింగ్ జరుగుతుంది. నామనేషన్ల విత్ డ్రా గడువు ముగిసినా రెబల్స్ వెనక్కి తగ్గలేదు. బీజేపీ నేతల బుజ్జిగింపుల్ని లెక్కచేయలేదు. 12 స్థానాల్లో స్వతంత్రులుగా బరిలో నిలిచి సవాల్ విసిరారు. వీరిలో ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మధుశ్రీవాస్తవ్ ఉన్నారు.ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు బరిలో నిలిచారు. గుజరాత్ నార్త్ , సెంట్రల్‌లో ఈ నియోజకవర్గాలున్నాయి.

182 స్థానాలు..1,621 మంది అభ్యర్థులు

గుజరాత్‌లో 182 నియోజకవర్గాలు ఉన్నాయి. డిసెంబర్ 1,5 రెండు విడతల్లో ఎన్నికలు జరుగుతాయి. అన్ని స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తుంది. కాంగ్రెస్ 179 నియోజకవర్గాల్లో బరిలో ఉంది. మూడు స్థానాల్ని పొత్తులో భాగంగా ఎన్సీపీకి ఇచ్చింది.అయితే దేవగద్ బరియా స్థానం నుంచి ఎన్సీపీ అభ్యర్థి నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. తొలిసారిగా గుజరాత్ బరిలోకి వచ్చిన ఆప్ 181 స్థానాల్లో పోటీ చేస్తుంది. సూరత్ ఈస్ట్‌లో లాస్ట్ మినిట్‌లో అభ్యర్థి నామినేషన్ విత్ డ్రా చేసుకున్నారు. బీజేపీ నాయకులే బెదిరించారని ఆప్ రచ్చ రచ్చ చేసింది ఇక. ఎంఐఎం 14 స్థానాల్లో పోటీ చేస్తుంది. కానీ బాపు నగర్‌లో అభ్యర్థి నామినేషన్ ఉపసంహరించుకున్నారు.