Gujarat polls: Congress MLA reaches polling booth With gas cylinder on bicycle
mictv telugu

సైకిల్‌కు సిలెండర్ కట్టుకొని ఓటు వేసేందుకు బయల్దేరిన ఎమ్మెల్యే

December 1, 2022

గుజరాత్‌ అసెంబ్లీ మొదటి దశ ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది. ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమైన ఈ పోలింగ్‌కు ఓటర్లు తరలివస్తున్నారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద బారులు తీరారు. సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ జరగనుంది. కచ్-సౌరాష్ట్ర, దక్షిణ గుజరాత్ లోని 19 జిల్లాల్లో 89 స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఈ రోజు 2 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ క్రమంలో ఓటు వేసేందుకు వచ్చిన కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే అందరి దృష్టిని ఆకర్షించారు.

 

అమ్రేలిలో కాంగ్రెస్ ఎమ్మెల్యే పరేశ్‌ ధనాని.. సైకిల్‌కి సిలిండర్‌ కట్టుకుని తన కుటుంబ సభ్యులతో ఓటేయడానికి వెళ్లారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎల్పీజీ సిలిండర్‌ ధరలు భారీగా పెరిగాయని దానిపై రాశారు. మోదీ ప్రభుత్వంలో ద్రవ్యోల్బణం పెరిగిందని, నిరుద్యోగులు ఎక్కువయ్యారని..ఇలా కుటుంబ సభ్యులంతా ఒక్కొక్క నినాదాలతో సైకిళ్లపై ఓటు వేయడానికి బయల్దేరారు. బీజేపీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఓటర్ల దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు ఆ ఎమ్మెల్యే. ఇప్పుడు ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారుతున్నది.

ఇదిలావుండగా, ఉపాధి, చౌక గ్యాస్ సిలిండర్లు, రైతులకు రుణమాఫీ, రాష్ట్ర ప్రగతిశీల భవిష్యత్తు కోసం ఓటు వేయాలని కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ గుజరాత్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.‘గుజరాత్ సోదర సోదరీమణులందరికీ విజ్ఞప్తి… ఉపాధి, చౌక గ్యాస్ సిలిండర్లు, రైతుల రుణమాఫీ, గుజరాత్ ప్రగతిశీల భవిష్యత్తు కోసం ఓటు వేయండి’ అని గాంధీ హిందీలో ట్వీట్ చేశారు.