ఫైనల్‌కు చేరిన గుజరాత్.. ఓడిన ఆర్ఆర్ - MicTv.in - Telugu News
mictv telugu

ఫైనల్‌కు చేరిన గుజరాత్.. ఓడిన ఆర్ఆర్

May 25, 2022

ఐపీఎల్ 2022 సీజన్ మ్యాచ్‌లు చివరి దశకు చేరుకున్నాయి. తొలి క్వాలిఫయర్ మ్యాచ్‌లో గత రాత్రి గుజరాత్ టైటాన్స్ ఉత్కంఠ పోరులో రాజస్థాన్ రాయల్స్‌పై విజయం సాధించి, తొలి సీజన్‌లోనే ఫైనల్‌కు చేరుకున్న జట్టుగా రికార్టు సృష్టించింది. మొదటగా టాస్ గెలిచిన టైటాన్స్ ఫీల్డింగ్ ఎంచుకుని, రాజస్థాన్ రాయల్స్‌కి బ్యాటింగ్ అప్పజేప్పింది. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 188 పరుగుల స్కోరు చేసింది. బట్లర్ 56 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్సర్లతో (89) పరుగులు చేయగా, కెప్టెన్ సంజు శాంసన్ (47), పడిక్కల్ (28) పరుగులు చేశారు.

అనంతరం బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్.. వృద్ధిమాన్ సాహా (0), గిల్‌ 21 బంతుల్లో 5 ఫోర్లు, సిక్సర్‌తో (35) పరుగులు చేసి రనౌట్ అయ్యాడు. ఆ తర్వాత కెప్టెన్ హార్దిక్ పాండ్యా మ్యాచ్‌ను ముందుకు నడిపించసాగాడు. కాసేపటికే 35 పరుగులు చేసిన వేడ్ అవుట్ అయ్యాడు. దాంతో డేవిడ్ మిల్లర్ క్రీజులోకి వచ్చాడు. తొలి 14 బంతుల్లో 10 పరుగులు చేసిన మిల్లర్.. క్రమ క్రమంగా ఫామ్‌లోకి వచ్చి.. 3 ఫోర్లు, 5 సిక్సర్లతో (68) పరుగులు చేయగా, పాండ్యా 27 బంతుల్లో 5 ఫోర్లతో (40) పరుగులు చేశాడు. గుజరాత్‌ను ఒంటి చెత్తో గెలిపించిన మిల్లర్‌ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డును అందుకున్నాడు. ఫలితంగా అరంగేట్రంలోనే ఫైనల్ చేరిన జట్టుగా గుజరాత్ రికార్డుకెక్కింది. రాజస్థాన్ నిర్దేశించిన 189 పరుగుల విజయ లక్ష్యాన్ని మరో మూడు బంతులు మిగిలి ఉండగానే మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి, టైటాన్స్ ఘన విజయం సాధించింది.