2022లో జరిగిన గుజరాత్ అల్లర్ల కేసులో సుప్రీంకోర్టు ఇవాళ కీలక తీర్పు వెలువరించింది. గుజరాత్ లోని గోద్రా సహా పలు ప్రాంతాల్లో జరిగిన అల్లర్లలో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్రమోడీతో పాటు పలువురి పాత్ర ఉందనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై విచారణ జరిపిన సిట్ .. వీరందరికీ గతంలోనే క్లీన్ చిట్ ఇచ్చింది. అయితే దీన్ని సవాల్ చేస్తూ బాధితురాలు జాకియా జాఫ్రీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీన్ని విచారించిన సుప్రీంకోర్టు కొట్టివేస్తూ ఇవాళ తీర్పు ప్రకటించింది.
ఫిబ్రవరి 28, 2002న అహ్మదాబాద్‌లోని గుల్బర్గ్ సొసైటీలో జరిగిన హింసాకాండలో 69 మంది మరణించారు. చనిపోయిన వారిలో కాంగ్రెస్ ఎంపీ ఎహ్సాన్ జాఫ్రీ కూడా ఉన్నారు. దీంతో ఈ అల్లర్లలో అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీతో పాటు ఆయన ప్రభుత్వంలో మంత్రులు, అధికారులు, పోలీసుల పాత్ర ఉందని, ఇందుకు బాధ్యుల్ని చేస్తూ వారిని శిక్షించాలని ఎహ్సాన్ జాఫ్రీ భార్య జాకియా జాఫ్రీ న్యాయపోరాటం చేస్తున్నారు. గతంలోనే దీనిపై గుజరాత్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గుల్బర్గా సొసైటీ అల్లర్ల కేసును విచారించిన సిట్ బృందం 2012 ఫిబ్రవరి 8న నరేంద్రమోడీతో పాటు ఇతరులకు క్లీన్ చిట్ ఇస్తూ నివేదిక ఇచ్చింది. హైకోర్టు సైతం ఆ సిట్ చర్యను సమర్థించింది. ఈ నివేదికపై అప్పట్లో కలకలం రేగింది. దీంతో బాధితురాలు జాకియా జాఫ్రీ సుప్రింకోర్టులో సవాల్ చేశారు. పలువాదోపవాదాల తర్వాత ఈ కేసులో సిట్ ఇచ్చిన క్లిన్ చిట్ సరైందేనని జస్టిస్ ఖాన్విల్కర్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు బెంచ్ అభిప్రాయపడింది. దీంతో ఈ పిటిషన్‌ను తోసిపుచ్చుతూ ఇవాళ తీర్పు వెలువరించింది.