గుజరాత్ లోని బనస్కాంత జిల్లాకు చెందిన ఓ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు వినూత్న పద్ధతిలో బోధిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. విద్యార్థుల కోసం కుర్తాల మీద పదాలను.. సూత్రాలను రాసుకొని తిరుగుతున్నాడు.
కోవిడ్ – 19 చాలామందిలో క్రియేటివ్ ఆలోచనలను పెంపొందించడానికి ఉపయోగపడింది. అలాగే ఈ ఉపాధ్యాయుడికి కూడా ఒక వినూత్న ఆలోచన వచ్చింది. నీలాంబాయి చమన్ భాయ్ పటేల్ గ్రామంలోని పాఠశాల లో వినూత్న బోధన పద్ధతి ద్వారా పిల్లలను ఉత్తేజపరచాలని ఆలోచించాడు. అలా చేస్తున్నాడు కాబట్టే అతనికి గ్రామ అధికారులు గుర్తించి వివిధ బిరుదులతో సత్కరించారు.
నేపథ్యమేమిటంటే..
బనస్కాంతలోని కాంక్రేజ్ తాలూకాలోని శ్రీ హరినగర్ ప్రాథమిక పాఠశాలల్లో నీలాంబాయి 16యేండ్లుగా ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. విద్యావేత్తగా బాధ్యతలు చేపట్టిన రోజు నుంచి గ్రామస్తులకు విద్యపై అవగాహన కల్పించేందుకు ఆయన అనేక ప్రయత్నాలు చేశారు. ప్రస్తుతం ఈ పాఠశాలల్లో 70మందికి పైగా చిన్నారులు విద్యనభ్యసిస్తున్నారు. అయితే లాక్డౌన్ సమయంలో పాఠశాలలు మూసివేశారు. అప్పుడు ఆన్ లైన్ విద్యను ప్రకటించినప్పుడు నీలాంబాయికి ఈ ఆలోచన వచ్చింది.
పుస్తకాలతో కాకుండా..
నీలాంబాయి పటేల్ విద్యార్థులకు పుస్తకాలకు అతీతంగా విద్యనందించాలనుకున్నడు. అందుకోసం తన కుర్తాపై అక్షరాలు, గణిత సూత్రాలు, జిల్లా స్థానిక సమాచారం మొదలైన వాటిని ముద్రించడం మొదలు పెట్టాడు. దీని ద్వారా పిల్లలకు సృజనాత్మకంగా విద్యను అందించాడు. ఇంతటితో ఆగకుండా.. పర్యావరణం పై అవగాహన పెంచడానికి కొత్త జాతుల పక్షులు, జంతువులు, చెట్లు మొదలైన వాటిని చెప్పడం ప్రారంభించాడు. పాఠశాలల్లో కూడా గూళ్లు, ఎకో క్లబ్ లో భాగంగా ఒక చిన్న కిచెన్ గార్డెన్ ను కూడా తయారు చేశాడు. పాఠశాలలో మునగ చెట్లను నాటిచాడు.
అవార్డులు..
నీలాంబాయి ఉపాధ్యాయ వృత్తికి చేసిన అపారమైన కృషికి పోర్బందర్ లో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్నాడు. అంతేకాదు.. గురు గౌరవ్ అవార్డును కూడా అందుకున్నాడు. ఇక తల్లిదండ్రుల పొగడ్తలకు అయితే లెక్కేలేదు. ఇలాంటి టీచర్లు ఉంటే కచ్చితంగా పిల్లలు శ్రద్ధగా పాఠాలు వింటారు.