మంచి చేయడానికి కొన్ని ఊళ్లల్లో తీర్మానాలు చేస్తుంటారు కుల పెద్దలు. కానీ గుజరాత్ లో మాత్రం వింత వింత పద్ధతులను అవలంభించాలంటూ తీర్మానం చేశారు. అవేంటో ఒకసారి చదివితే మీరే నోరెళ్లబెడుతారు.సెల్ ఫోన్ వాడకం వల్ల అమ్మాయిలు తప్పుదారి పడుతున్నారని థాకూర్ సమాజం భావించింది. అందుకే పెండ్లి కానీ అమ్మాయిలు ఎవరైనా సరే మొబైల్ ఫోన్స్ వాడకూడదని తీర్మానించేశారు. దీంతోపాటు అట్టహాసంగా పెండ్లిళ్లు చేయకూడదని, అతిథుల గురించి, డీజేల గురించి కూడా ఈ తీర్మానంలో ఉన్నాయి.
మరిన్ని సంస్కరణలు..
ఆడవాళ్ల మీద వివక్ష చూపించమంటూనే వింత నిర్ణయాలు తీసుకుంటున్నారు చాలామంది. అందులో గుజరాత్ లోని థాకూర్ సమాజ్.. ఆడపిల్లలను ఆంక్షల ఛట్రంలో నెట్టేయడానికి సిద్ధమైంది. ఇక్కడ వీరి సమాజానికి చెందిన పెండ్లి కానీ అమ్మాయిల చేతుల్లో మొబైల్స్ కనిపిస్తే కఠినంగా శిక్ష విధించాలని నిర్ణయించుకున్నారు. బనాస్ కాంత జిల్లాలోని భాభర్ తాలూకా లున్ సేలా గ్రామంలో జరిగిన సంత్ శ్రీ సదారామ్ బాపు విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో ఈ సంస్కరణ గురించి ప్రకటించారు. ఇవే కాకుండా నిశ్చితార్థానికి 11మంది, పెండ్లికి 51మంది అతిథులు మాత్రమే హాజరు కావాలి. వివాహాల్లో డీజేలపై పూర్తిగా నిషేధం విధించారు. అలాగే పెండ్లిళ్లల్లో బహుమతులకు బదులుగా నగదు ఇవ్వాలి. మత్తుపదార్థాలకు అలవాటైన వారిక డీ -అడిక్షన్ క్యాంపులు నిర్వహించాలి. చదువుకోవడానికి వెళ్లే బాలికలకు ప్రత్యేక రవాణా ఏర్పాట్లు చేయాలని తీర్మానించారు.
విమర్శల వెల్లువ..
గతంలో ఠాకూర్ సమాజంలో కులాంతర వివాహం విషయంలో తీసుకున్న నిర్ణయం వివాదస్పదమయింది. తమ గ్రామంలోని అబ్బాయి, అమ్మాయిలెవరైనా వారి కుటుంబ సభ్యులు అనుమతి లేకుండా పెండ్లి చేసుకోకూడదు. ముఖ్యంగా ఠాకూర్ వంశానికి చెందిన యువతీయువకులు వేరే వర్గానికి చెందిన వారిని పెండ్లి చేసుకుంటే రూ.2 లక్షల జరిమానా చెల్లించాలని 2019లో తీర్మానం చేశారు. దానిపై ఇప్పటికీ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పుడు అమ్మాయిలు ఫోన్ వాడడం వల్ల తప్పుదారి పడతారని అందుకే పెండ్లి కాని అమ్మాయిలు ఫోన్ వాడకూడదనే విషయం మీద కూడా విమర్శలు వినిపిస్తున్నాయి.