Gujarat to give 2 free LPG cylinders a year to Ujjwala scheme beneficiaries
mictv telugu

దీపావళి గిఫ్ట్.. ఏడాదికి 2 ఎల్పీజీ సిలిండర్లు ఉచితం

October 18, 2022

గుజరాత్‌లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏడాదికి 2 గ్యాస్‌ సిలిండర్లను ఉచితంగా ఇవ్వనున్నట్లు ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి జీతూ వఘాని ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో గృహిణులకు రూ.1,000కోట్ల మేర లబ్ధి చేకూరనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని 38 లక్షల మంది గృహిణులను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వఘాని వివరించారు. సీఎన్‌జీ, పీఎన్‌జీ గ్యాస్‌లపైనా 10 శాతం వ్యాట్‌ను తగ్గించనున్నట్లు గుజరాత్‌ ప్రభుత్వం ప్రకటించింది.

ఈ నిర్ణయంతో ఒక కేజీ సీఎన్‌జీపై రూ. 6 నుంచి 7 వరకు, అలాగే ఒక కేజీ పీఎన్‌జీపై రూ.5 నుంచి 5.50 తగ్గునుందని మంత్రి జీతూ వఘాని తెలిపారు. దీపావళి సందర్భంగా ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న బహుమతి ఇదేనని చెప్పారు. ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద లబ్ధి పొందుతున్న వారందరికీ ఈ పథకం వర్తిస్తుందని, రిఫండ్‌ మొత్తం నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోనే జమ అవుతుందని మంత్రి వివరించారు. అయితే, ఇది ఎన్నికల జిమ్మిక్కేనని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. బీజేపీ అధికారంలో ఉన్న ఇతర రాష్ట్రాల్లోనూ ఈ పథకాన్ని అమలు చేయాలని విపక్ష నేతలు డిమాండ్ చేస్తున్నారు.