ఓ హిజ్రా కథ.. తన బిడ్డకు తండ్రీ, తల్లీ ఆమెనే.. - MicTv.in - Telugu News
mictv telugu

ఓ హిజ్రా కథ.. తన బిడ్డకు తండ్రీ, తల్లీ ఆమెనే..

February 16, 2021

ezr

టెక్నాలజీ కొంత పుంతలు తొక్కుతోంది. మనుషుల ఆలోచనలు కూడా బాగా మారిపోతున్నాయి. తమ కోరికలను నెరవేర్చుకోడానికి టెక్నాలజీని చక్కగా వాడుకుంటున్నారు. స్త్రీపురుషులతోపాటు ట్రాన్స్‌జెండర్లు కూడా టెక్నాలజీతో తమ తీరని కలలు సాకారం చేసుకుంటున్నారు.

బిడ్డకు జన్మనివ్వాలనే కోరికతో ఓ హిజ్రా దేశంలో ఎవరూ చేయని పని చేసింది. పుట్టుకతో మగవాడైన సదరు ట్రాన్స్‌జెండర్ తాను స్త్రీగా మారకముందు తన వీర్యాన్ని జాగ్రత్తగా భద్రపరచుకుంది. ఇప్పుడు స్త్రీగా మారి.. ఆ వీర్యంతో బిడ్డను కనబోతోంది. తన బిడ్డకు తానే తండ్రీ, తల్లీ కావాలనే ఆశతో ఆమె ఈ పథకం వేసింది. ప్రస్తుతం ట్రాన్స్‌జెండర్లకు గర్భాశయాన్ని అమర్చి, సంతానం కలిగించే టెక్నాలజీ లేకపోవడంతో ఆమె అద్దె గర్భాన్ని ఆశ్రయించింది.

గుజరాత్‌కు చెందిన హిజ్రా జెస్నూర్ డయారా కథ ఇది. పాతికేల్ల డయారా రష్యాలో మెడిసిన్ చేసింది. గోద్రా ప్రాంతంలోని పంచమహల్ అనే చిన్నపట్టణంలో జన్మించిన డయారాకు చిన్నప్పటి నుంచే లింగమార్పిడి చేయించుకోవాలని ఉండేదట. అయితే ఇంట్లోవాళ్లు ఒప్పుకోరని పెద్దయ్యేంతవరకు ఆగింది. కొన్నేళ్ల కిందట లింగమార్పిడి చేయించుకుంది. తనకంటూ ఓ బిడ్డ ఉండాలనే ఆశతో సర్జరీకి ముందు వీర్యాన్ని దాచుకుంది. ఇప్పుడు ఆ వీర్యాన్ని, ఓ మహిళ నుంచి సేకరించిన అండాన్ని కలిపి పిండంగా మార్చబోతోంది. తర్వాత సరోగసీ విధానంలో మరో మహిళ ద్వారా బిడ్డను కనబోతోంది. డయారాకు బిడ్డ పుడితే ఇలాంటి కేసు దేశంలో ఇదే మొదటి అవుతుంది.
‘ట్రాన్స్‌జెండర్లకు కూడా మనసు ఉంటుంది. గర్భాశయం లేనంతమాత్రాన వాళ్లు తల్లులు కాకుండా పోరు. ప్రేమకు ఎలాంటి సరిహద్దులూ లేవు.. ’ అంటోంది డయారా.