సింహాల మధ్య పండంటి బిడ్డకు జన్మ..! - MicTv.in - Telugu News
mictv telugu

సింహాల మధ్య పండంటి బిడ్డకు జన్మ..!

July 1, 2017

అది మారుమూల పల్లె..చుట్టూ దట్టమైన అడవి….తెల్లవారుజామున 2.30 గంటలు…గర్భణీకి పురిటి నొప్పులు…అంబులెన్స్ లో తరలించే ప్రయత్నం…సడెన్ గా అడవులో నుంచి రోడ్డెక్కిన సింహాలు..ఏం చేయాలో తెలియక అంబులెన్స్ ని ఆపేసిన సిబ్బంది. ఓవైపు సింహాల గర్జనలు..మరోవైపు గర్బిణీ అరుపులు.. ఆందోళనలో గర్భిణీ కుటుంబ సభ్యులు..అసలేం జరిగింది..?

గుజరాత్‌లో అమ్రేలి జిల్లాలోని ఓ పల్లెకు చెందిన మంగుబెన్ మక్వానా అనే గర్భిణికి జూన్ 29న పురిటి నొప్పులు వచ్చాయి. కుటుంబ సభ్యులు 108కి సమాచారం ఇచ్చారు. ఆ రాత్రి గ్రామానికి చేరుకున్న అంబులెన్స్ గర్భిణిని జఫరాబాద్ ఆస్పత్రికి తరలించేందుకు గిర్ ఫారెస్ట్ మీదుగా బయల్దేరింది. ఫారెస్ట్‌లోకి అంబులెన్స్ వెళ్లగానే ఎదురుగా 12 సింహాలు వచ్చాయి. దీంతో అంబులెన్స్‌ను 108 సిబ్బంది ఆపివేసింది. అంబులెన్స్‌ను చుట్టుముట్టిన సింహాలు గర్జిస్తున్నాయి.

వాహనం ముందుకు కదల్లేని పరిస్థితి. ఇక గర్భిణికి తీవ్రంగా రక్తస్రావం అవుతుంది. 108 సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించి.. ఫోన్ ద్వారా ఓ వైద్యురాలి సూచన మేరకు మహిళకు పురుడు పోశారు. సింహాల గర్జనల మధ్యే మహిళ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. మొత్తానికి 20 నిమిషాల తర్వాత సింహాలు పక్కకు వెళ్లడంతో అంబులెన్స్‌ను జఫరాబాద్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఇప్పుడు తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు.