సౌదీ అరేబియా దేశం గొప్ప నాయకుణ్ని కోల్పోయింది. సౌదీ కళ కళా విహీనమైనట్టే అయిందిప్పుడు ?ఆ దేశ యువరాజు, మాజీ ఉప ప్రధాన మంత్రి షేక్ అబ్దుల్ అజీజ్ తీవ్ర అనారోగ్యంతో కన్ను మూశారు. ఆయన వయసు 86 సంవత్సరాలు. పవిత్ర మక్కాలోని గ్రాండ్ మసీదు వద్ద ఆయన అంత్యక్రియలు నిర్వహిస్తామని రాయల్ కోర్టు ప్రకటించింది. అబ్దుల్ అజీజ్ మృతి పట్ల గల్ఫ్ దేశాలన్నీ తమ ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించాయి.
బహ్రెయిన్ రాజు హమద్ బిన్ ఇషా అల్ ఖలీఫా, ఆ దేశ ప్రధానమంత్రి ఖలిఫా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా, యువరాజు సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా తమ తమ సంతాపాన్ని తెలిపారు. అబ్దుల్ అజీజ్ 1931లో రియాద్‌లో జన్మించారు. అమెరికాలో ఆయన ఉన్నత విద్యను అభ్యసించారు. యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్‌లో డిగ్రీ చేశారు.
కాలిఫోర్నియా మిలటరీ అకాడమీలో కూడా ఆయన పూర్వవిద్యార్థి. 1970 దశకంలో ఆయన సౌదీ అరేబియా రాజ కుటుంబానికి సలహాదారుగా పనిచేశారు. అనంతరం 1978లో ఆ దేశ ఉప ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు. ఉప ప్రధానిగా ఉంటూ రక్షణ, విమానయాన శాఖలను ఆయన పర్యవేక్షించారు. 2011 వరకూ సౌదీ అరేబియా ఉప ప్రధానమంత్రిగా ఉన్నారు.