ప్రజలమనిషి, మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్యతో ముచ్చట - MicTv.in - Telugu News
mictv telugu

ప్రజలమనిషి, మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్యతో ముచ్చట

November 18, 2017

ఎమ్మెల్యే అంటే కారు, సెక్యూరిటీ గార్డులు, అనుచరుల హంగామా.. వంటివన్నీ కళ్లముందు కదలాడతాయి.. కానీ ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన గుమ్మడి నర్సయ్యను చూస్తే మొత్తం ఉల్టాగా ఉంటుంది. నాలుగు దశాబ్దాలుగా ప్రజా సమస్యలపై అకుంఠిత దీక్షతో పోరాడుతున్న గిరిజన యోధుడు నర్సయ్య.. అత్యంత సాదాసీదాగా ఉంటారు. నిత్యం ప్రజల, రైతుల, విద్యార్థుల సమస్యలపై నినదిస్తూనే ఉంటారు.

ప్రజల మనిషిగా అందరి అభిమానం చూరగొన్న గుమ్మడి నర్సయ్యను  మైక్ టీవీ కలసి ముచ్చటించింది. ఆయన విలువైన ఉద్యమ అనుభవాలను కదిలించింది. పాత ఖమ్మం జిల్లా ఇల్లందు నుంచి మొదలైన ఆయన రాజకీయ ప్రస్థానాన్ని అపురూపంగా దృశ్యాల్లో బంధించింది. తనకు తల్లిలాంటిదైన సీపీఎం న్యూడెమోక్రసీపై నర్సయ్య ప్రేమాభిమానాలను, ఐదుసార్లు ఇల్లందు నుంచి తనను అసెంబ్లీకి పంపిన స్థానికులతో ఆయన అనుబంధాలను తెలుసుకుంది.

‘ఏ రోజూ నేను కార్లలో తిరగలే.. ఎమ్మెల్యేగా వచ్చిన జీతాన్ని పార్టీకే ఇచ్చేశా.. పింఛను మొత్తాన్నీ ఇచ్చేస్తున్నా.. ప్రజా ఉద్యమాల్లో అలుపులేకుండా తిరిగాను.. జైలు శిక్షను అనుభవించాను..’. ఇలా మరెన్నో అనుభవాలను నర్సయ్య పంచుకున్నారు. తన  పెంకుటిల్లును చూపించి, అత్యంత సాదాసీదా ఉన్న తన కుటుంబ సభ్యులను పరిచయం చేశారు. తన రెండెకరాల పొలానికి తీసుకెళ్లి, నేలతల్లితో అనుబంధాన్ని వివరించారు. ఆ ముచ్చట్లన్నీ మీ మైక్ టీవీ అందిస్తోంది..