పల్నాడు జిల్లా రొంపిచర్లలో కాల్పులు కలకలం సృష్టించాయి. అలవాలలో మండల టీడీపీ అధ్యక్షుడు బాలకోటిరెడ్డిపై మరోసారి హత్యాయత్నం జరిగింది. బాలకోటిరెడ్డి ఇంట్లో ఉన్న సమయంలో ప్రత్యర్థులు తుపాకీతో రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన అతడిని వెంటనే నరసరావుపేటలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం బాలకోటి రెడ్డి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. కాల్పులకు పాల్పడింది పమ్మి వెంకటేశ్వర రెడ్డి, పూజల రాముడు, గడ్డం వెంకట్రావుగా గుర్తించి పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
రెండోసారి హత్యాయత్నం
రొంపిచర్ల టీడీపీ మండల అధ్యక్షుడిగా ఉన్న మాజీ ఎంపీపీ వెన్నా బాలకోటిరెడ్డిపై గతంలో కూడా హత్యాయత్నం జరిగింది. అలవాల గ్రామంలో మార్నింగ్ వాక్కు వెల్లిన సమయంలో గొడ్డళ్లతో బాలకోటిరెడ్డిపై దాడి చేశారు. అయితే ప్రాణాలతో బయటపడిన బాలికోటిరెడ్డిపై ఇపుడు మళ్లీ హత్యాయత్నానికి పాల్పడ్డం కలకలం రేపుతోంది. సమాచారం అందుకున్న పోలీసులు అప్రమత్తమై ముందస్తుగా అలవాలలో భారీగా బలగాలను మోహరించారు.